
- బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: ముస్లింలను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ మొదటి నుంచి బీసీ వ్యతిరేక పార్టీగా ఉందని.. బీసీ రిజర్వేషన్లపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మంగళవారం సెక్రటేరియెట్ మీడియా పాయింట్లో బీసీ నేతలతో కలిసి జాజుల మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పెంపును బీజేపీ అడ్డుకుంటోందని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో మూడ్రోజుల ఆందోళన నిర్ణయం సరైందని, బీసీ సంఘాల సూచనతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని జాజుల వెల్లడించారు. రాష్ట్రంలో చట్టబద్ధంగా జరిగిన కులగణనను రాంచందర్ రావు విమర్శించడం మూర్ఖత్వమని విమర్శించారు.