111జీవో రద్దు సరికాదు: ఎంపీ ఆర్. కృష్ణయ్య

111జీవో రద్దు సరికాదు: ఎంపీ ఆర్. కృష్ణయ్య
  • దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తం: ఎంపీ ఆర్. కృష్ణయ్య
  • బీసీ భవన్​లో సత్యాగ్రహ దీక్ష

ముషీరాబాద్, వెలుగు: జంట నగరాలను కాపాడే 111 జీవోను రద్దు చేయడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా జీవోను కాపాడుకుంటామని తెలిపారు. గురువారం విద్యానగర్​లోని బీసీ భవన్​లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. దీక్షలో ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ రైతు సంఘం నేత కోదండ రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షుడు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిరక్షణలో భాగంగానే 111 జీవో  వచ్చిందని, దీని వల్లే 7 మండలాలు, 84 గ్రామాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. వరదల నుంచి హైదరాబాద్​కు ముప్పు తప్పిందని వెల్లడించారు. ఆదాయం కోసం రాష్ట్ర సర్కార్ జీవోను రద్దు చేయాలని నిర్ణయించిందని మండిపడ్డారు. దీనిపై అన్ని పార్టీలు కలిసి కట్టుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరారు. లేకుంటే తామే 111 జీవోను రక్షించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని..ప్రభుత్వ అవినీతిపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామన్నారు. జీవో రద్దు వెనక కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

హైదరాబాద్​కు నీళ్ల కరువు వస్తది

111 జీవో రద్దుతో హైదరాబాద్​కు భవిష్యత్తులో నీళ్ల కరువు వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి అన్నారు. ఈ జీవోనే జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను కాపాడుతోందని గుర్తుచేశారు. 111 జీవోను యథాతథంగా కొనసాగించాలని టీడీపీ నగర అధ్యక్షుడు సాయిబాబా డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి పోరాడాలని కోరారు. 

రద్దు ప్రమాదకర చర్య

111 జీవోను కాపాడి హైదరాబాద్ మునిగిపోకుండా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధినేతలు చేస్తున్న లక్షల కోట్ల అవినీతిని, దోపిడీని అరికట్టాలని కోరారు. 111 జీవో రద్దు అత్యంత ప్రమాదకర చర్యగా ఉందని వెల్లడించారు.ఇప్పటికైనా జీవో రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గాలని..లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, మల్లేశ్​, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.