బీసీలకు టికెట్ దక్కేనా?..లీడర్లు పార్టీలకతీతంగా డిమాండ్

బీసీలకు టికెట్ దక్కేనా?..లీడర్లు పార్టీలకతీతంగా డిమాండ్
  •     నియోజకవర్గంలో 60 శాతం బీసీలే
  •     పార్టీలకతీంగా ఏకమైన బీసీ లీడర్లు
  •     హైకమాండ్​ దృష్టికి బీసీ డిమాండ్ 

మంచిర్యాల, వెలుగు : రానున్న ఎన్నికల్లో  మంచిర్యాల నియోజకవర్గ టికెట్​ను బీసీ అభ్యర్థులకు కేటాయించాలని ఆ వర్గం లీడర్లు పార్టీలకతీతంగా డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పటికే  బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు టికెట్ ప్రకటించింది. దీంతో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి బహిరంగంగానే నిరసన తెలిపారు. బీసీలకు టికెట్ ఇవ్వకుంటే దివాకర్ రావును ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయినా హై కమాండ్ రెస్పాండ్ కాలేదు.

త్వరలో కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల టికెట్​ఈసారైనా బీసీలకు దక్కుతుందా.. లేదంటే ఎప్పటిలాగే ఓసీ అభ్యర్థులకు వెళుతుందా.. అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. 

60 శాతం బీసీలే..

మంచిర్యాల నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అంతకుముందు లక్సెట్టిపేటగా ఉండేది. 1952లో ఫస్ట్​ ఎలక్షన్​ మొదలు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే బీసీకి ఎమ్మెల్యేగా చాన్స్​ వచ్చింది. 1978లో చుంచు లక్ష్మయ్య జనతా పార్టీ నుంచి గెలిచి 1983 వరకు కొనసాగారు.  

మిగతా 65 సంవత్సరాలుగా అగ్రవర్ణాలదే హవా నడుస్తోంది. నియోజకవర్గంలోని మొత్తం జనాభాలో 98 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉంటారు. ఇందులో 60 శాతం బీసీలు ఉంటారు. సమగ్ర సరర్వే ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 2.47 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో సుమారు 1.50 లక్షల మంది బీసీలు ఉన్నారు.  

గత ఎన్నికల నుంచే బీసీ నినాదం

నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీలు రాజకీయంగా మాత్రం వెనుకబడి పోతున్నారు. 2018 ఎన్నికల్లో మొదటిసారి బీసీ నినాదం తెరపైకి వచ్చింది. పార్టీలకతీతంగా బీసీ లీడర్లు ఏకమై నియోజకవర్గంలో ఊరూరా పాదయాత్రలు చేపట్టారు. ప్రత్యేక కమిటీలను వేసి బీసీలకే మద్దతు ఇవ్వాలని తీర్మానాలు చేశారు. అయినా ఆ  ఎన్నికల్లో వారనుకున్నది మాత్రం జరగలేదు. ప్రస్తుతం ఐదేండ్ల తర్వాత మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో బీసీ ఎమ్మెల్యే డిమాండ్ మరోసారి ఊపందుకుంది. ఆయా పార్టీలకు చెందిన బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏకమై 'మంచిర్యాల నియోజకవర్గ బీసీ రాజ్యాధికార సాధన ఐక్యవేదిక'ను ఏర్పాటు చేసుకున్నారు.

బీసీ ఎమ్మెల్యే  డిమాండ్​ను హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. పలుమార్లు రౌండ్​ టేబుల్​ మీటింగులు, రిలే నిరాహార దీక్షలు, బైక్​ ర్యాలీలు నిర్వహించారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈసారి బీసీలకే టికెట్లు కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల తరపున ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపి గెలిపించుకుంటామని చాలెంజ్​ చేస్తున్నారు.  

స్పందించని పార్టీలు

బీసీ ఎమ్మెల్యే డిమాండ్​పై ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించలేదు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​ మంచిర్యాలలో సిట్టింగ్​ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుకే టికెట్​ కేటాయించింది. దీనిపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్​రెడ్డి తన అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దివాకర్​రావు గ్రాఫ్​ డౌన్​ అయిందని, అభ్యర్థిని మార్చాలని హైకమాండ్​ను డిమాండ్​ చేశారు.

మంచిర్యాల టికెట్​ ఈసారి తనకు గాని లేదంటే బీసీలకు గాని కేటాయించాలని కోరారు. కానీ బీఆర్​ఎస్​ హైకమాండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్​ లేదు.  అలాగే రానున్న ఎన్నికల్లో బీసీలకు 40 శాతం టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రకటించినా ఆచరణలో మాత్రం 
అనుమానమే.

ముగ్గురిదీ ఒకే సామాజిక వర్గం

బీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల్లోని ముగ్గురు బలమైన లీడర్లు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.  సిట్టింగ్​ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు ఇప్పటికే నాలుగుసార్లు గెలిచి ఐదోసారి గెలుపొంది రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్​ నుంచి టికెట్​ రేసులో ముందున్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు కూడా బలమైన లీడరే.  పదేండ్లుగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ సొంత బలాన్ని పెంచుకున్నారు. 2018లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు పేరు టికెట్​ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో డిపాజిట్​ కోల్పోయినప్పటికీ ఇటీవల కాలంలో బీజేపీ బాగా పుంజుకుంది. తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేనియా వల్ల బీజేపీ గ్రాఫ్​ అనూహ్యంగా పెరిగింది.  అయితే ఈ ముగ్గురు లీడర్లకు సరితూగే నాయకుడు బీసీల్లో ఉన్నాడా అని కొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల టికెట్ బీసీలకు వస్తుందా లేదా అనే చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.