బీసీలు పెద్ద సంఖ్యలో పోటీ చేయాలి.. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో మా చిత్తశుద్ధికి నిదర్శనం

బీసీలు పెద్ద సంఖ్యలో పోటీ చేయాలి..  బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో మా చిత్తశుద్ధికి నిదర్శనం
  •     42శాతం రిజర్వేషన్లతో రాజకీయంగా మరింత ఎదగాలి: మంత్రి పొన్నం
  •     హైకోర్టు తీర్పు ప్రకారమే లోకల్‌‌ బాడీ ఎలక్షన్స్‌‌పై ముందుకెళ్తం
  •     రిజర్వేషన్లకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: లోకల్​బాడీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 42 శాతం రిజర్వేషన్లను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని, ఆయా చోట్ల పోటీచేసేందుకు ఉత్సాహంగా ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ రిజర్వేషన్లతో రాజకీయంగా మరింత ఎదగాలని సూచించారు. 

సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని​ గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌తో తెలంగాణలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధికి  ప్రభుత్వం విడుదల చేసిన జీవోనే నిదర్శనమని పేర్కొన్నారు. వచ్చే నెల 8న రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ఉన్నందున  ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని  చెప్పారు. 

హైకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారమే ముందుకుపోతామని స్పష్టం చేశారు.  స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా లోకల్‌‌‌‌‌‌‌‌బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లను మార్చుకొనే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు.  రిజర్వేషన్ల విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ మద్దతివ్వాలని కోరారు. 

పొలిటికల్‌‌‌‌‌‌‌‌ పార్టీలు అఫిడవిట్లు ఇవ్వాలి 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.  దీనిపై ఈ నెల 9 నుంచి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను బీసీ మంత్రులందరం కలిసి స్వయంగా విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు అమలు సాధ్యం కాదని ప్రశ్నించారు. రిజర్వేషన్లను నిలిపివేయాలని పిటిషన్లు వేసినవారు.. విత్ డ్రా చేసుకోవాలని కోరారు. తెలంగాణలో సామాజిక మార్పును అందరూ స్వాగతించాలని, ప్రత్యేక రాష్ట్రం కోసం మొదట్లో బీజేపీ వ్యతిరేకిస్తే..తాము పోరాడి  ఆ పార్టీ మద్దతు ఇచ్చేలా చేశామని చెప్పారు. 

ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇచ్చేలా రాష్ట్ర అధ్యక్షుడిని ఒప్పిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.  దీని అమలుకు తనవంతు ప్రయత్నం చేసి, ఆ పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ను ఒప్పించాలని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ను పొన్నం కోరారు. బీసీల నోటికాడి ముద్దను ఎవరూ లాక్కున్నే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ చాంపియన్ అని స్పష్టం చేశారు.  

బీసీల ఆగ్రహానికి గురికావొద్దు: మంత్రి వాకిటి

పార్టీ నాయకత్వాల మెప్పుకోసం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడి సమాజంలోని బీసీల ఆగ్రహానికి గురికావొద్దని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.