ముషీరాబాద్, వెలుగు: డిసెంబర్ మొదటి వారంలో జరుగనున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపి, 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
కోర్టు తీర్పులను సాకుగా చూపి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటే కుదరదన్నారు. తామెంతో తమకంతా వాటా దక్కాలన్నారు. చట్టబద్దంగా రిజర్వేషన్లు ఇవ్వకుంటే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలికట్టే విజయ కుమార్ గౌడ్, ఎస్.దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, వి.నాగభూషణం, విజయకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
