బ్రేక్​ ఫాస్ట్ కాదు.. సౌలత్​లు కల్పించాలి: బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్

బ్రేక్​ ఫాస్ట్ కాదు.. సౌలత్​లు కల్పించాలి: బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్
  • బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్

ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌలత్​లు కల్పించకుండా  స్టూడెంట్లకు బ్రేక్ ఫాస్ట్ పెట్టడం ఏంటని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ రాష్ట్ర సర్కార్​ను నిలదీశారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చకుండా ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. శుక్రవారం బాగ్​లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాసు సురేశ్ మాట్లాడారు.

 రాష్ట్రంలో విద్యను కార్పొరేట్ మయం చేసి, వాటి నిర్వాహకులను కేబినెట్​లో కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని విమర్శించారు. రూ. కోట్ల ప్రజాధనాన్ని పార్టీ ప్రచారం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. బ్రేక్ ఫాస్ట్ పేరుతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బిహార్ తరహాలో రాష్ట్రంలోని బీసీల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఇప్పటికీ బయటపెట్టలేదని విమర్శించారు. 

బీసీ వ్యతిరేక విధానాలు వీడి న్యాయం చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాల్లో బీసీ రాజ్యాధికార సమితి పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్​లో సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన సమితినాయకులు జక్కె వీరస్వామి, బీసీ రాజ్యాధికార సమితి మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి, ప్రధాన కార్యదర్శి గోశిక స్వప్న, ఆకాశ్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.