- సాధ్యం కాని హామీలిచ్చి బీసీలను సర్కార్ మోసం చేసిందన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- మైనార్టీ రిజర్వేషన్లను 12% పెంచుతామని బీఆర్‌ఎస్ ఎట్లా చెప్పిందన్న మంత్రి సీతక్క
- కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ రాకపోవడంతో రిజర్వేషన్లపై అడుగు ముందుకుపడలేదు: మంత్రి శ్రీధర్ బాబు
- ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు రమ్మన్నా బీఆర్ఎస్ వాళ్లు రాలేదని మండిపాటు
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో గురువారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి బీసీలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించగా, కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు రాకపోవడం వల్లే సమస్య తలెత్తిందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
బీసీ రిజర్వేషన్లపై కేంద్రాన్ని కదిలించేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్ వాళ్లు ఎందుకు రాలేదని నిలదీశారు. ఒక జాతీయ పార్టీగా హామీ ఇచ్చామని, మరి ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ మైనార్టీ రిజర్వేషన్లను 12 శాతం ఎట్లా పెంచిందని, దానికి చట్టబద్ధత ఉందా? అని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కాగా, బీసీ రిజర్వేషన్లపై పార్టీలకతీతంగా కలిసికట్టుగా పోరాడాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.
బీసీలను నమ్మించి మోసం చేయకండి: తలసాని
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామ ని హామీ ఇచ్చి బీసీలను నమ్మించి మోసం చేశారని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. పార్లమెంట్‌లో చట్టం చేయకుండా బీసీ ల రిజర్వేషన్లను పెంచడం సాధ్యం కాదని, హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్డుకుంటాయని తెలిసి కూడా బీసీలను మభ్య పెట్టడానికి రిజర్వేషన్లపై జీవోలు ఇచ్చి దగా చేశారన్నారు.
ఇప్పుడేమో బీజేపీ అడ్డుకుంటోందని నాట కాలు ఆడడం సరికాదన్నారు. బడుగులకు రాజకీయ ప్రాధాన్యత దక్కొద్దా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా జరగలేదని, భూసాని కమిషన్ రిపోర్ట్ నేటి వరకు పబ్లిక్ డొమెన్‌లో పెట్టలేదన్నారు. ‘‘బీసీలకు బడ్జెట్‌లో కేటాయింపులు, ఖర్చులకు పొంతనలేదు.
ఇది అంకెల గారడీ కాదా. ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టింది .. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది .. రాహుల్ గాంధీతో మాట్లాడించింది కాంగ్రెస్ పార్టీనే కదా.. బీజేపీ ఈ హామీ ఇవ్వలేదు కదా’’అని ప్రశ్నించారు. మీ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇష్టం ఉంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో రాహుల్, మల్లికార్జున ఖర్గేతో పాటు యూపీఏ లీడర్లు ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కనీసం ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేదో చెప్పాలన్నారు.
రాష్ట్రస్థాయిలో అమలు చేసే అవకాశం ఉన్న బీసీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఎందుకు అమలు చేయడం లేదని, బడ్జెట్‌లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించి ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ‘‘బీసీ బిడ్డగా చెబుతున్నా.. సీనియర్ ఎమ్మెల్యేలలో నేను ఒకరిని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేనే ఒక బ్రాండ్.. నాకు ఎవరి గుర్తింపు అక్కర్లేదు.. బీసీ బిడ్డలకు కోపం తెప్పించొద్దు.. నమ్మించి మోసం చేయకండి.. బీజేపీ ముచ్చట పక్కనపెట్టి రాష్ట్రస్థాయిలో మీ చేతిలో ఉన్న పనులు ఇకనైనా చేయండి’’అని ప్రభుత్వానికి తలసాని సూచించారు.
మా అల్లున్ని గెలిపించినందుకు సంతోషం
శాసనసభలో గురువారం మంత్రి వాకిటీ శ్రీహరి మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చి గెలిపించుకున్నామని తెలిపారు. దీనిపై తలసాని స్పందిస్తూ “మా అల్లున్ని నిలబెట్టి గెలిపించినందుకు సంతోషం” అంటూ సభలో నవ్వులు పూయించాయి.
మీది ప్రాంతీయ పార్టీ.. మైనార్టీ రిజర్వేషన్లు ఎట్లా పెంచిన్రు: మంత్రి సీతక్క
ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు 12% రిజర్వేషన్లను పెంచు తూ జీవోలు ఇచ్చిందని.. దీనికి చట్టబద్దత ఉందా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. జాతీయ పార్టీని ప్రశ్నించే ముందు మీ పార్టీ పరిధి ఏంటో గుర్తుంచుకోవాలన్నారు. యూపీఏ పార్టీల భాగస్వామ్యంతో త్వరలోనే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు కచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత తీసుకొస్తామన్నారు.
బీఆర్‌ఎస్ నేతల కుళ్లు బుద్ధి బయటపడింది: మంత్రి శ్రీధర్ బాబు
42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంలో చట్టబద్ధత తీసుకురావాలనే డిమాండ్‌తో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొనడానికి పిలిచినా బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు రాలేదని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ నేతల కుళ్లు బుద్ధి ఏంటో అప్పుడే బయటపడిందన్నారు. చరిత్రలో తప్పిదాలు జరుగుతాయని.. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
‘‘రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భావనతో బీసీల రిజర్వేషన్ల పెంపుపై హామీ ఇచ్చామన్నారు. తీరా అక్కడ మళ్లీ బీజేపీనే గద్దెనెక్కడంతో రాష్ట్రంలో పెంచిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత రాలేదు”అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
అందరం కలిసి పోరాడుదాం: మంత్రి వాకిటి
బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవ రూ తప్పుబట్టాల్సిన అవసరం లేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. భారత్ జోడో పాదయాత్రలో భాగంగా తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇది దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచింన్నారు. కానీ కేంద్రంలో అడ్డుకోవడం వల్ల దీనిని అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. దీనిపై అన్ని పార్టీలకు చెందిన లీడర్లంతా ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
