రిజర్వేషన్ వ్యతిరేకులదిఅధర్మ పోరాటం.. బీసీలకు హైకోర్టు అన్యాయం చేయదు: జాజుల శ్రీనివాస్ గౌడ్

రిజర్వేషన్ వ్యతిరేకులదిఅధర్మ పోరాటం.. బీసీలకు హైకోర్టు అన్యాయం చేయదు: జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో సుదీర్ఘంగా జరిగిన వాదనల ప్రకారం.. బీసీలకు హైకోర్టు న్యాయం చేస్తుందన్న విశ్వాసం తమకు ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విచారణ వాయిదా పడిన తరువాత హైకోర్టు దగ్గర మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా 60 బీసీ సంఘాల నేతలు ఇంప్లీడ్ అయ్యారని, బీసీ రిజర్వేషన్ల కోసం సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న బీసీ సంఘాల నేతల తరఫున కూడా మా వాదనలు కూడా వినాలని గురువారం హైకోర్టుకు విన్నవిస్తామని ఆయన తెలిపారు.

 రిజర్వేషన్ వ్యతిరేకులది అధర్మ పోరాటమని.. వారు చేసే వాదనలలో ఏమాత్రం న్యాయం లేదన్నారు. అన్యాయంగా బీసీలకు రావలసిన వాటాను అడ్డుకోవాలని చూడడం చాలా దుర్మార్గమని జాజుల మండిపడ్డారు. గత 80 సంవత్సరాలుగా బీసీలకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావలసిన రిజర్వేషన్లు దక్కనీయకుండా చేశారని.. ఇంకా అడ్డుతగులుతూ చరిత్రలో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులుగా మారొద్దని ఆయన కోరారు.