బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డు..బిల్లులను ఐదు నెలలుగా ఆమోదించట్లే: జాజుల శ్రీనివాస్

బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డు..బిల్లులను ఐదు నెలలుగా ఆమోదించట్లే: జాజుల శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను కేంద్రమే అడ్డుకుంటున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఐదు నెలలుగా ఆమోదించట్లేదని తెలిపారు. రాష్ట్రపతి, గవర్నర్లు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు.

 బిహార్ మాజీ సీఎం బిందెశ్వర్ ప్రసాద్ మండల్ (బీపీ మండల్) 107 జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని  బీసీ భవన్ లో  మండల్ ఫొటోకు జాజులతో పాటు బీసీ నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా  జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మండల కమిషన్ సిఫార్సులతోనే  బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయన్నారు. 

మండల్ కమిషన్ బీసీలకు జనాభా దామాషా ప్రకారం 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా బీసీలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.  ఐదు నెలలుగా ఈ బిల్లులను ఆమోదించకుండా కేంద్రం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్నదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఆమోదించకపోతే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని జాజుల శ్రీనివాస్ గౌడ్  హెచ్చరించారు .