బీసీ బిల్లును ఆమోదించేలా గవర్నర్ను ఒప్పించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ బిల్లును ఆమోదించేలా గవర్నర్ను ఒప్పించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • కిషన్ రెడ్డి, రాంచందర్ రావుకు జాజుల డిమాండ్
  • లేకపోతే రాజ్ భవన్​ను ముట్టడిస్తామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్  జిష్ణుదేవ్  వర్మ ఇప్పటికైనా ఆమోదించాలని, ఈ దిశగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రాంచందర్ రావు ఒత్తిడి తేవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  డిమాండ్  చేశారు. ఆదివారం హైదరాబాద్  సెక్రటేరియెట్  మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు కావాలంటే బిల్లుకు గవర్నర్  ఆమోదం తెలపాలని హైకోర్టు సూచించిందని గుర్తుచేశారు. 

గవర్నర్  కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నందున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తక్షణమే గవర్నర్ ని కలిసి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదించేలా కృషి చేయాలని జాజుల డిమాండ్  చేశారు. ఈ అంశంపై బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిని కలుస్తామని తెలిపారు. గవర్నర్  నాన్చివేత వైఖరి అవలంబిస్తే రాష్ట్రవ్యాప్తంగా వేల మంది బీసీలు, బీసీలకు కలిసి వచ్చే అఖిలపక్ష పార్టీలతో రాజ్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

అలాగే, బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 9ని సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవాలని చూశారని ఆయన మండిపడ్డారు. బీసీల వైపు న్యాయం ఉంది కాబట్టే హైకోర్టు బీసీ రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. రెడ్డి జాగృతి నేతలు ఈ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్  చేశారు.