రొటేషన్‌‌ పాలసీకి బీసీసీఐ సై!

రొటేషన్‌‌ పాలసీకి బీసీసీఐ సై!

ముంబై: ఏడాది పొడవునా బిజీబిజీగా గడిపే ఇండియా క్రికెటర్లకు తగినంత విశ్రాంతి ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌‌‌‌ అండ్‌‌‌‌ వేల్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ బోర్డు(ఈసీబీ) మాదిరిగా ప్లేయర్స్‌‌‌‌ రొటేషన్‌‌‌‌ పాలసీని అమలు చేయాలని బోర్డు భావిస్తోంది. టీమిండియా నయా కోచ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌ కూడా ఇదే ఆలోచనతో ఉండటంతో రొటేషన్‌‌‌‌ పాలసీ అమలు లాంఛనమేనని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ‘ప్లేయర్ల అలసటను మేము కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. వరుస పెట్టి బయో బబుల్స్‌‌‌‌లో ఉండటం అంటే ఆషామాషీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రొటేషన్‌‌‌‌ పాలసీ చాలా అవసరం. న్యూజిలాండ్‌‌‌‌ సిరీస్‌‌‌‌తోనే ఈ పాలసీ అమలును ప్రారంభిస్తున్నాం. బెంచ్‌‌‌‌ బలం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. టీ20ల వరకైనా సరే  ఎక్కువ మంది కొత్తవాళ్లకు  చాన్స్‌‌‌‌ ఇస్తాం. టెస్టులకు మెయిన్‌‌‌‌ జట్టు ఎప్పట్లానే ఉంటుంది. నిజానికి రొటేషన్‌‌‌‌ పాలసీ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ద్రవిడ్‌‌‌‌ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌, సౌతాఫ్రికా వంటి పెద్ద టూర్లప్పుడు రొటేషన్‌‌‌‌ను పాటించం. ప్రధాన ప్లేయర్లందర్నీ ఈ సిరీస్‌‌‌‌లకు అందుబాటులో ఉంచుతాం. రొటేషన్‌‌‌‌ అమల్లో భాగంగా ఏదైనా సిరీస్‌‌‌‌ నుంచి ప్లేయర్లు విశ్రాంతి కోరుకుంటే కచ్చితంగా రెస్ట్‌‌‌‌ ఇస్తాం’ అని సదరు అధికారి చెప్పారు. కాగా, రాబోయే రెండేళ్లలో ఐపీఎల్‌‌‌‌ కాకుండా ఇండియా ప్లేయర్లు అన్ని ఫార్మాట్స్‌‌‌‌ కలిపి 100కు పైగా మ్యాచ్‌‌‌‌లు ఆడాల్సి ఉంది.