న్యూఢిల్లీ: కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 19 ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ నేషనల్ టీమ్ ఎంట్రీపై బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. యూనివర్శల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ త్వరలోనే సీనియర్ నేషనల్ టీమ్‌లో కనిపిస్తాడని చెప్పారు. ఐపీఎల్ 2026లో రాణించిన యువ ఆటగాళ్లపై బీసీసీఐ సెలెక్టర్లు కన్నేసి ఉంచారని.. యువ కెరటం సూర్యవంశీకి తొలిసారిగా భారత సీనియర్ జట్టులో చోటు దక్కడానికి ఎక్కువ సమయం పట్టదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘వైభవ్ భారత క్రికెట్‌లో ఒక కొత్త వండర్‌కిడ్. రాబోయే రోజుల్లో అతను ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తాడని నేను బలంగా నమ్ముతున్నా. మా సెలెక్టర్లందరూ ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగమే. సెలెక్టర్లు ఐపీఎల్ మ్యాచ్‌లను చాలా నిశితంగా గమనించారు. చాలా సందర్భాల్లో వారు స్టేడియానికి కూడా హాజరయ్యారు’’ అని సైకియా పేర్కొన్నారు.
ALSO READ : నార్వే చెస్ టోర్నీలో భారత్ జోరు
భారత జట్టు యూకే పర్యటన కోసం జట్టును ఎంపిక చేసే సమావేశాలలో సెలెక్టర్లు వైభవ్ సూర్యవంశీ పేరును పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. భారత క్రికెట్ ప్రపంచానికి ఒక కొత్త వండర్‌కిడ్ దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని.. అతడు ఖచ్చితంగా అన్ని సరిహద్దులను దాటుకుని ముందుకు వెళ్తాడన్నారు. సైకియా వ్యాఖ్యలతో వైభవ్ సూర్యవంశీ త్వరలోనే జాతీయ జట్టు తలుపు తట్టడం ఖాయమనిపిస్తోంది.
ఐపీఎల్ 2026లో వైభవ్ ఊచకోత
ఐపీఎల్ 2026లో ధనాధన్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. ఐపీఎల్ 2026లో బౌలర్లను ఊచకోత కోస్తూ 16 మ్యాచ్‌లలో 237.31 స్ట్రైక్ రేట్‌తో 72 సిక్సర్లు, 63 ఫోర్లతో 776 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో 59 సిక్సర్ల క్రిస్ గేల్ రికార్డుతో సహా అనేక రికార్డులను వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ సీజన్ ముగిసేసరికి అతను ఏకంగా ఐదు అవార్డులను కూడా గెలుచుకున్నాడు.
