T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియాను సెలక్ట్ చేసేది ఆ రోజే

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియాను సెలక్ట్ చేసేది ఆ రోజే

ప్రస్తుతం అభిమానుల దృష్టాంతా ఐపీఎల్ మీదే ఉంది. ఈ క్యాష్ లీగ్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ పొట్టి సమరానికి మరో నెల రోజులకు పైగా సమయం ఉన్నా.. జట్టును మాత్రం మే 1 లోపు ప్రకటించాలని ఐసీసీ ఇప్పటికే తెలియజేసింది. ఈ క్రమంలో టీమిండియా టీ20 వరల్డ్ జట్టును ఎప్పుడు ప్రకటిస్తారో ఆసక్తికరంగా మారింది. అయితే భారత జట్టును ఏప్రిల్ 27 లేదా ఏప్రిల్ 28 న ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. 

2024 T20 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న ఓపెనర్ రోహిత్ శర్మ.. ఏప్రిల్ 27 న ఢిల్లీ క్యాపిటల్స్ తో  మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. దీంతో అదే రోజు భారత సెలక్టర్లతో రోహిత్ శర్మ జాయిన్ కానున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ లిస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్ తో కూడిన 10 మంది సభ్యులు దాదాపుగా ఖరాయనట్టు సమాచారం. మిగిలిన 5 గురు ఆటగాళ్లల్లో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. 

జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే జూన్ 5 న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు  జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లన్ని అమెరికాలోనే ఆడబోతుంది.