డబ్బులే డబ్బులు: బీసీసీఐ ఖజానాకు ఏడాదికి రూ.2 వేల కోట్లు!

డబ్బులే డబ్బులు: బీసీసీఐ ఖజానాకు ఏడాదికి రూ.2 వేల కోట్లు!

ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డు అంటే ఏది అనగానే.. ఏం ఆలోచించకుండా టక్కున చెప్పే పేరు బీసీసీఐ. ఒక్క ఏడాదికే ఎన్నో వేల కోట్లు ఆర్జిస్తూ.. వరల్డ్​ క్రికెట్‌లో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరు పొందింది. ఆ పరంపరను బీసీసీఐ భవిష్యత్తులోనూ కొనసాగించనుంది. వచ్చే నాలుగేళ్లు బీసీసీఐ.. ఐసీసీ నుంచి ప్రతి ఏటా రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించనుంది. 

ఐసీసీ ఇటీవల డర్బన్‌(దక్షిణాఫ్రికా) వేదికగా జరిగిన బోర్డ్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సభ్యదేశాల క్రికెట్ బోర్డులకు చెల్లించాల్సిన మొత్తాలపై.. కొత్త రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్‌కు ఆమోదం తెలిపింది. ఈ నూతన విధానం ప్రకారం.. ప్రతి ఏటా ఐసీసీ ఆదాయంలో 38.5 శాతం బీసీసీఐకి దక్కనుంది. గతంలో ఇది 22.4 శాతంగా ఉండేది. అది కాస్తా ఇప్పుడు 72 శాతం పెరిగి 38.5 శాతానికి చేరింది. అంటే.. ఐసీసీ నుంచి ప్రతి ఏటా బీసీసీఐకి 231 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.2 వేల కోట్లు) అందనున్నాయి.

ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా.. రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు. ఇది అందరి కృషి వల్లే సాధ్యమైందని ఆయన అందులో వెల్లడించారు. ఇక బీసీసీఐ తరువాత.. ఐసీసీ నుండి అత్యధిక ఆదాయం పొందే దేశాలలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా రెండు.. మూడు స్థానాలలో ఉన్నాయి. ఈసీబీకి 6.89 శాతం(41 మిలియన్ డాలర్లు) షేర్ దక్కనుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియాకు 6.25 శాతం(37.53 మిలియన్ డాలర్లు) ఆదాయం లభించనుంది. 2024 నుండి 2027 వరకు ఈ నూతన రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్ అమలులో ఉండనుంది.

ఆట తీరు(ర్యాంకింగ్‌), జట్టుకు ఆదరణ, ఆటకు వాణిజ్య సహకారం, ఐసీసీ టోర్నీల్లో ప్రదర్శన తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని.. ఈ వాటా ఇవ్వనున్నారు.