టీమిండియాలో బరువు గోల: రోహిత్ 84 కేజీలు.. సర్పరాజ్ 64 కేజీలు

టీమిండియాలో బరువు గోల: రోహిత్ 84 కేజీలు.. సర్పరాజ్ 64 కేజీలు

'బీసీసీఐ vs సర్ఫరాజ్ ఖాన్' వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి అతని బరువును సాకుగా చూపుతూ బీసీసీఐ అధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. అతనికంటే బరువున్న టీమిండియా ఆటగాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ బీసీసీఐ పక్షపాత వైఖరిని నెటిజెన్స్ ఎండగడుతున్నారు. 

"గత మూడేళ్లుగా 900కు పైగా పరుగులు చేసిన ఆటగాడిని పరిగణనలోకి తీసుకోకపోవడానికి సెలెక్టర్లు ఏమైనా పిచ్చివాళ్లా?. అతడిని ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం ఫిట్‍నెస్. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అతని ఫిట్‍నెస్ లెవెల్స్ లేవు. అతడు మరింత కష్టపడాలి. ధృడంగా తయారవ్వాలి..." అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఈ వ్యాఖలపై నెటిజెన్స్ భగ్గుమంటున్నారు. బరువు ఎక్కువున్న భారత ఆటగాళ్లను ఈ వివాదంలోకి లాగుతున్నారు.

సెంచరీకి చేరువలో రోహిత్ శర్మ

చూడడానికి సర్ఫరాజ్ ఖాన్ బొద్దుగా కనిపించినా.. అతని బరువు 64 కిలోలు మాత్రమే. ఈ విషయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(87kg) అతనికంటే 20కిలోలు ఎక్కువ బరువున్నాడు. అదే రిషబ్ పంత్‌ను తీసుకున్నా.. 79కిలోల బరువున్నాడు. అంటే.. సర్ఫరాజ్‌తో పోలిస్తే 15 కిలోలు ఎక్కువ. రవిచంద్రన్ అశ్విన్(74kg), అజింక్యా రహానే(74kg), రవీంద్ర జడేజా(74kg), విరాట్ కోహ్లీ(74kg).. ఇలా అంతనికంటే చాలామందే ముందువరుసలో ఉన్నారు.

ఈ విషయమే బీసీసీఐ సెలెక్టర్లను వివాదంలోకి నెడుతోంది. సర్ఫరాజ్ ఖాన్ ‌పై బీసీసీఐ పెద్దలు కక్ష్య సాధింపుకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. బరువును ఒక సాకుగా చూపుతోందని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై బీసీసీఐ అధికారులు మరోమారు స్పందిస్తారేమో వేచి చూడాలి.