లక్ష సాయానికి సవాలక్ష కష్టాలు..క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న బీసీలు

లక్ష సాయానికి  సవాలక్ష కష్టాలు..క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం  కాళ్లరిగేలా తిరుగుతున్న బీసీలు
  • తహసీల్దార్ ఆఫీసులు, మీ సేవా సెంటర్ల వద్ద  పడిగాపులు 
  • టెక్నికల్ సమస్యలతో సతాయిస్తున్న సర్వర్  
  • సర్టిఫికెట్ల కోసం జిల్లాల్లో రోడ్డెక్కిన జనం  
  • ఆర్థికసాయం అప్లికేషన్లకు ఇయ్యాల్టితో ముగియనున్న గడువు.. ఆందోళనలో అర్హులు 
  • గడువు పొడిగింపుపై స్పష్టతనివ్వని సర్కార్ 
  • రేషన్ కార్డుల్లేక లక్షలాది మంది ఆర్థికసాయానికి దూరం 

మహబూబ్​నగర్/హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వం ఇచ్చే రూ.లక్ష ఆర్థిక సాయానికి అప్లై చేసుకునేందుకు బీసీలు తిప్పలు పడుతున్నారు. క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం రెండు వారాలుగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తహసీల్దార్ ఆఫీసులు, మీ సేవా సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్టిఫికెట్ల జారీకి సర్వర్ సతాయిస్తుండడం, మంగళవారంతో ఆర్థిక సాయానికి అప్లై చేసుకునేందుకు గడువు ముగియనుండడం, రెండ్రోజులుగా ఆ వెబ్ సైట్ కూడా సతాయిస్తుండడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆగ్రహించిన కొంతమంది పలు జిల్లాల్లో నిరసనకు దిగారు. 

బీసీ కులవృత్తుల వాళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అప్లికేషన్లలో క్యాస్ట్, ఇన్ కమ్, రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. దీంతో అర్హులందరూ సర్టిఫికెట్ల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు తహసీల్దార్ ఆఫీసుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అన్నం కూడా అక్కడికే తెప్పించుకుని తింటున్నారు. వీరితో పాటు ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు స్టూడెంట్లు.. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల్లో అర్హత సాధించిన క్యాండిడేట్లు క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం తహసీల్ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. అయితే వచ్చిన అప్లికేషన్లపై గ్రామాలకు వెళ్లి ఎంక్వైరీ చేయాల్సి ఉండగా.. వీఆర్వోలు లేకపోవడంతో ఈ ప్రాసెస్ జరగడం లేదు. 

వీఆర్ఏలు ఉన్నా వాళ్లను తహసీల్దార్లు ఆఫీస్ పనులకు వాడుకుంటున్నారు. దీంతో గ్రామాలకు వెళ్లి ఎంక్వైరీ చేసి సర్టిఫికెట్లు జారీ చేసే సరికి ఆలస్యమవుతోంది. మరోవైపు టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో సర్వర్ సతాయిస్తోందని, దీంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. మీ సేవా సెంటర్​లో ఒక్క అప్లికేషన్ చేయడానికి దాదాపు 40 నిమిషాలు పడుతోందని చెబుతున్నారు. మళ్లీ తహసీల్ ఆఫీసుల్లో సిబ్బంది ఎంటర్ చేసేందుకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. 

అర్హత ఉన్నా అనర్హులైపోతున్నరు... 

అప్లికేషన్లకు క్యాస్ట్, ఇన్ కమ్, బ్యాంక్ అకౌంట్ తో పాటు రేషన్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. కానీ ప్రభుత్వం కొన్నేండ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడం, కుటుంబంలో ఒక్కరికే ఆర్థిక సాయం చేస్తామని రూల్ పెట్టడం, అప్లికేషన్లకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో.. ఉమ్మడి రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లోని చాలామంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములిద్దరు వేర్వేరుగా కాపురం ఉండి, వాళ్లకు ఒకే రేషన్​ కార్డు ఉంటే.. 

వారిలో ఒక్కరే ఆర్థిక సాయానికి అర్హులు అవుతున్నారు. మరొకరికి అర్హత ఉన్నా సాయానికి దూరమవుతున్నారు. ముందు ఒకరు అప్లై చేస్కుంటే, మరొకరు వెళ్లి అప్లై చేస్కుందామంటే.. ఆ రేషన్ కార్డుపై ఆల్ రెడీ దర ఖాస్తు వచ్చినట్టుగా మెసేజ్ వస్తోంది. దీనికి తోడు గతంలో బీసీ కార్పొరేషన్​లోన్ల కోసం అప్లై చేసుకున్నోళ్ల అప్లికేషన్లు కూడా రిజెక్ట్ అవుతున్నాయి. చాలామందికి లోన్లు రాకపోవడంతో, వాళ్లంతా ఇప్పుడు అప్లై చేస్కుంటుండగా.. ఆ రేషన్ కార్డు మీద ఇప్పటికే అప్లై చేసినట్టు మెసేజ్ వస్తోంది. దీం తో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. 

ఇప్పటి వరకు 4 లక్షల అప్లికేషన్లు..  

బీసీలకు ఆర్థిక సాయానికి సోమవారం వరకు దాదాపు 4 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. మంగళవారమే చివరి తేదీ కావడంతో ఇంకో లక్ష వరకు అప్లికేషన్లు వస్తాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. దాదాపు 2 లక్షల దరఖాస్తులు వస్తాయనుకుంటే అంతకు మించి రావడంతో తేదీని పొడిగించేందుకు సర్కార్ తర్జనభర్జన పడుతోంది. అప్లికేషన్లు పెరిగితే రూ.లక్ష చొప్పున ఎన్ని వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతోంది. ఇప్పుడు వచ్చిన అన్ని దరఖాస్తులకే ఆర్థిక సాయం ఇవ్వడం కష్టమని అధికారులు అంటున్నారు. కేవలం రూ.వెయ్యి కోట్లు అంటే లక్ష మందికే సాయమందించే ప్లాన్​ లో ప్రభుత్వం ఉందని తెలిసింది. కాగా, ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లలో అత్యధికంగా రజకుల నుంచి 80 వేల దరఖాస్తులు రాగా.. సెకండ్ ప్లేస్ లో విశ్వబ్రాహ్మణులు, మూడో ప్లేస్ లో నాయీ బ్రాహ్మణులు ఉన్నట్లు తెలిసింది.

జిల్లాల్లో ఆందోళనలు.. 

క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతుండడంతో ఆగ్రహించిన బీసీలు జిల్లాల్లో సోమవారం ఆందోళనలు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ తహసీల్దార్ ఆఫీసును బీసీ లతో కలిసి కాంగ్రెస్​ నేతలు ముట్టడించారు. శివ్వంపేట తహసీల్దార్ ఆఫీస్ ముందు జనం ధర్నా చేశారు. మెదక్–బొడ్మట్​పల్లి మెయిన్ రోడ్డు మీద పాపన్నపేట తహసీల్దార్ ఆఫీస్​ముందు పబ్లిక్ రాస్తారోకో చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్​పేట- భూంపల్లి తహసీల్దార్​ఆఫీసు వద్ద దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు. పైరవీ కారులకే సర్టిఫికెట్లు​అందుతున్నాయని ఆర్ఐ భిక్షపతిని నిలదీశారు. అనంతరం సిద్దిపేట-–మెదక్ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట కూడా జనం ధర్నా చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో రోడ్డుపై బైఠాయించారు.

తమ్ముడిది ఓకే అయింది.. నాది కాలే.. 

మేం ఇద్దరం అన్నదమ్ములం. ఇద్దరికీ లగ్గాలు అయినయ్. కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేస్కుంటే రాలేదు. అందరికీ ఒక్కటే రేషన్ కార్డు ఉంది. రూ.లక్ష ఆర్థిక సాయానికి అప్లై చేసుకోవడానికి మూడ్రోజుల కింద మీ సేవ సెంటర్​కు పోయిన. అప్లై చేసినంక మా రేషన్ కార్డు మీద ఆల్ రెడీ అప్లికేషన్ ఉందని మెసేజ్ వచ్చింది. మా తమ్ముడు అప్లై చేస్కున్న అని చెప్పిండు. వాడిది ఓకే అయి, నాది కాలేదు. 

- కతలయ్య, కోయిలకొండ

ఆల్ రెడీ అప్లై చేసినట్టు వస్తున్నది.. 

నేను 2016లో బీసీ కార్పొరేషన్ లోన్ కోసం అప్లై చేసిన. కానీ లోన్​ రాలేదు. ఇప్పుడు రూ.లక్ష ఆర్థిక సాయానికి అప్లై చేస్కుంటే.. ఆల్​రెడీ అప్లై చేసినట్టు చూపిస్తున్నది. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. బీసీ కార్పొరేషన్​లోన్లకు అప్లై చేసుకుని, లోన్​రానోళ్లకు ఈ పథకంలో ప్రయారిటీ ఇవ్వాలి. 

- హరికృష్ణ, మిడ్జిల్