పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి : మాజీ ఎంపీ రాపోలు

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42%  రిజర్వేషన్ ఇవ్వాలి :   మాజీ ఎంపీ రాపోలు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల(గ్రామ పంచాయతీ) ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గత బీఆర్ఎస్ సర్కార్... కేవలం 22 శాతం రిజర్వేషన్లు అమలు చేసి బీసీలకు తీరని అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు.

 కాంగ్రెస్ పాలనలో ఇలాంటి తప్పిదాలు జరగకుండా... బీసీలకు న్యాయం చేసేలా రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రభుత్వ పాలనపై ఫోకస్ పెట్టే దిశలో.. పంచాయతీ ఎన్నికలను ఆదరబాదరగా నిర్వహించవద్దని సూచించారు. ఎన్నికలు త్వరగా నిర్వహించాలన్న తొందర్లో బీసీలకు రాజ్యాధికారంలో న్యాయపరమైన వాటా దక్కుకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీసీ ఐక్య సంఘాలు, బీసీ సంఘాల నేతలు ఏకతాటిపైకి రావాలని ఆనంద భాస్కర్ కోరారు.