బీసీలకు 50 శాతం పదవులివ్వాలి : రేవంత్​కు ఆర్.కృష్ణయ్య లేఖ

బీసీలకు 50 శాతం పదవులివ్వాలి : రేవంత్​కు ఆర్.కృష్ణయ్య లేఖ
  • నామినేటెడ్ పోస్టుల్లో న్యాయం చేయాలి

హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు :  నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం బీసీ భవన్ నుంచి లేఖను విడుదల చేశారు. త్వరలో భర్తీ చేయబోయే కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీలు, దేవాదాయ కమిటీతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల్లో బీసీల జనాభా ప్రకారం పదవులు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన బీసీ నాయకులు ఉన్నారని, వారి ప్రతిభ, సేవలు గుర్తించి న్యాయం చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని గుర్తు చేశారు.

బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వలేదని, పంచాయతీరాజ్ సంస్థలు రిజర్వేషన్లు 34 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారని మండిపడ్డారు. ప్రైవేట్ యూనివర్సిటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేశారని, ఫీజు రీయింబర్స్​మెంట్ కు బడ్జెట్ ఇవ్వలేదన్నారు. బీసీలు కోపంతో బీఆర్ఎస్ పార్టీపై పెద్దఎత్తున ఉద్యమాలు చేశారని తెలిపారు. ఇటీవల నియమించిన ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్కరు కూడా బీసీలు లేరని, బీసీ సంక్షేమ శాఖకు కమిషనర్ లేక వ్యవస్థ కుంటుపడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ.20వేల కోట్లు కేటాయించాలన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి ఫ్యామిలీకి 20 లక్షలు మంజూరు చేయాలన్నారు. మంత్రివర్గంలో 50% కోటా ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా, ఆర్‌.కృష్ణయ్యను బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్‌ సోషల్‌ మీడియా మెంబర్‌ సురేశ్ సన్మానించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.