ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్  వీపీ గౌతమ్  సూచించారు. శుక్రవారం డ్రై డే సందర్భంగా నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి 3వ డివిజన్ లో పర్యటించి దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డీఎంహెచ్​వో డాక్టర్  బి మాలతి, కార్పొరేటర్ మాలీదు జగన్మోహన్ రావు, అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, డీఎంవో డా. సంధ్య ఉన్నారు. అనంతరం డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో పర్యటించి శానిటరీ పనులను పరిశీలించారు. క్రమం తప్పకుండా జ్వర సర్వే నిర్వహించాలని, లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్. రాంబాబు, ఎంపీడీవో ఆర్. రామకృష్ణ, ఎంపీవో కె. శ్రీనివాస రెడ్డి, సర్పంచ్ ఆర్. మాధవి ఉన్నారు.

దళితబంధుపై సమీక్ష

కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 482 మంది లబ్ధిదారులనుగుర్తించి 402 యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. చింతకాని మండలంలో 3,462 మంది లబ్ధిదారులకు గాను 1,437 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ కలెక్టర్​ రాధిక గుప్తా, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, జడ్పీ సీఈవో అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్  ఈడీ శ్రీనివాసరావు, డీఆర్డీవో విద్యాచందన, డీఏవో విజయనిర్మల, డీఎంహెచ్​వో డాక్టర్. మాలతి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పోడు భూముల్లో కందకాలు తవ్వొద్దు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సుజాతనగర్​ మండలం రామవరం రేంజ్​ పరిధిలోని గరీబ్​ పేట బీట్​ పరిధిలోని పోడు భూముల్లో ఫారెస్ట్​ సిబ్బంది కందకాలు తవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం బాధిత గిరిజనులు కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు. 70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నామని వారు తెలిపారు. హైకోర్టు స్టే ఆర్డర్​ ఉన్నా ఫారెస్ట్​ ఆఫీసర్లు కందకాలు తవ్వుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

ఉద్రిక్తంగా మారిన ఎస్ఎఫ్ఐ ధర్నా

కలెక్టరేట్​ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. సంక్షేమ హాస్టల్స్​లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థి పోరు గర్జన జీపు జాతా ముగింపు సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్​లోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బూర్రా వీరభద్రం మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పాటించడం లేదని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు జి పవన్, నాయకులు భూపేందర్, వంశీ, నవీన్, చరణ్, శైలజ, మంజుల. నందిని పాల్గొన్నారు. 

ప్రారంభానికి సిద్ధంగా ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పాల్వంచలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ బిల్డింగ్​ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని కలెక్టర్​ అనుదీప్​ తెలిపారు. కొత్త కలెక్టరేట్​ ​ను ఆయన శుక్రవారం సందర్శించి వివిధ శాఖలకు ఆఫీసులను కేటాయించారు. ఫర్నీచర్, ఫైల్స్​ ఏర్పాటు చేసుకోవాలని, ప్రతీ ఆఫీసుకు సైన్​ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్అండ్​బీ ఆఫీసర్లను ఆదేశించారు. సీఎం త్వరలో జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. కలెక్టరేట్​ ఆవరణలో నిర్మించే హెలీప్యాడ్​ పనులను ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు, ఎస్పీ వినీత్​తో కలిసి కలెక్టర్​ పరిశీలించారు. అడిషనల్​ కలెక్టర్​ కె. వెంకటేశ్వర్లు, ఆర్​అండ్​బీ ఈఈ బీమ్లా, డీఆర్డీవో మధుసూదన్​రాజు, డీపీవో రమాకాంత్​ పాల్గొన్నారు. 

విద్యుత్ మీటర్లు ఇవ్వాలని సబ్ స్టేషన్ ముట్టడి

పాల్వంచ,వెలుగు: తమ కాలనీకి విద్యుత్ మీటర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని తెలంగాణ నగర్ వాసులు శుక్రవారం పాల్వంచ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. మీటర్ల కోసం రూ.3300 మీసేవ ద్వారా చెల్లించి నెలలు గడుస్తున్నా మీటర్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ సమస్య పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించగా, ఈ నెల 8న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. వెంటనే తమకు మీటర్లు ఇవ్వాలని లేకపోతే కోర్టు ధిక్కరణ కేసు పెడతామని హెచ్చరించారు. అనంతరం ఏఈ ప్రతాప్ కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రశాంత్,లక్ష్మణ్, ప్రవీణ్, రాము, సీతారాములు, ప్రభాకర్, వెంకటరమణ, శారద, కరీం, నీల,ఉమ, భవాని, వెంకటమ్మ, వరలక్ష్మి, సమీరా, వీరన్న, హథీరాం పాల్గొన్నారు.

గణేశ్​ వేడుకలకు భారీ బందోబస్తు

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రశాంత వాతావరణంలో గణేశ్​ ఉత్సవాలు జరుపుకునేలా పోలీస్  అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీ విష్ణు ఎస్  వారియర్ ఆదేశించారు. గణేశ్​ ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.  ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వినాయక మండపాలతో పాటు ఇతర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గజ ఈతగాళ్లు, క్రేన్స్, లైటింగ్స్, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సంబంధిత శాఖల ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 

నామ్​కే వాస్తేగా జడ్పీ స్టాండింగ్​ కమిటీ మీటింగులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రజా సమస్యలపై చర్చించవలసిన జిల్లా పరిషత్​ స్టాండింగ్​ కమిటీ సమావేశాలు నామ్​కే వాస్తేగా జరిగాయి. స్టాండింగ్​ కమిటీ మీటింగ్​లంటే ప్రజాప్రతినిధులకు పట్టింపులేకుండా పోతోంది. జిల్లా పరిషత్​లో శుక్రవారం నిర్వహించిన ఏడు స్టాండింగ్​ కమిటీ సమావేశాలు అయిందనిపించారు. స్టాండింగ్​ కమిటీల్లో సభ్యులైన ఎమ్మెల్యేలతో పాటు జడ్పీటీసీలు రాలేదు. ఉన్నతాధికారుల జాడలేదు. మహిళా సంక్షేమ స్టాండింగ్​ కమిటీ చైర్మన్​గా వ్యవహరిస్తున్న జడ్పీటీసీ బిందుమాధవి ఆలస్యంగా వచ్చారు. ఆ కమిటీ సభ్యులు ఎవరూ రాకపోవడంతో కొంత సేపు కూర్చొని వెళ్లి పోయారు. వ్యవసాయ కమిటీ సమావేశం జడ్పీ వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​ అధ్యక్షతన సాగింది. జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, జడ్పీటీసీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. జిల్లా అధికారులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో చర్చించిన అంశాలపై సమాధానం చెప్పే పరిస్థితి లేనప్పుడు ఈ సమావేశాలెందుకని వెంకటరెడ్డి ప్రశ్నించారు. చండ్రుగొండ కేజీబీవీ నుంచి చికెన్, కూరలను నాయకులకు పెడుతూ పిల్లల నోళ్లు కొడుతున్నారని ఆరోపించారు. జడ్పీ సీఈఓ విద్యాలత, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి పాల్గొన్నారు.