భద్రాచలం, వెలుగు : భద్రాచలం దేవస్థాన మాస్టర్ ప్లాన్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఎండోమెంట్ కమిషనర్ హరీశ్‌తో హైదరాబాద్‌లో రివ్యూ చేశారు. సీఎం ఆమోదం మేరకు పనులు మొదలుపెట్టాలని, పూర్తిగా ఆగమశాస్త్రం ప్రకారం పనులు చేపట్టాలని సూచించారు.
భూసేకరణ పూర్తి కావడంతో ఆలయం మాఢ వీధుల విస్తరణ, ప్రాకార నిర్మాణాల పనులు చేయాలని, ఈ మేరకు త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేపట్టనున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా అన్ని శాఖలతో సన్నాహక సమావేశం నిర్వహించాలని, కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వసతి కేంద్రాలు, మెడికల్ క్యాంపులు, శానిటేషన్, తాగునీరు, రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
