
రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతుండడంతో….అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. స్మార్ట్ డివైజెస్ ను వాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని…వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా గూగుల్ సెర్చ్ ఇంజన్ తో అలర్ట్ గా ఉండాలంటున్నారు. కస్టమర్ నెంబర్లతో నేరాలు అధికంగా జరుగుతుండడంతో….తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
పెరిగిన టెక్నాలజీతో…అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు జనం. కూర్చున్న చోటు నుంచే డిజిటల్ పద్దతిలో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేస్తూ కావాల్సిన వస్తువులను కొనేస్తున్నారు. నెలవారీ పేమెంట్ బిల్లులన్నీ ఆన్ లైన్ సేవలతోనే కానిచ్చేస్తున్నారు. అయితే ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లపాలిట వరంగా మారింది. కాస్త ఆదమరిస్తే… అకౌంట్ లోని డబ్బులన్నీ సెకన్ లో మాయం చేస్తున్నారు కేటుగాళ్లు.
ఇటీవల పెరిగిన డిజిటలైజేషన్ తో పాటే… సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ప్రతీ ఒక్కరిని అప్రమత్తం చేస్తోంది పోలీసు శాఖ. అపరిచితుల నెంబర్లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో మనం ఇచ్చిన డాటా…నిల్వ ఉండడంతో సమస్యలు వస్తాయని చెబుతున్నారు అధికారులు. ఈ వివరాలే సైబర్ నేరగాళ్లకు వరంలాగా మారుతున్నాయని చెబుతున్నారు. వీటి ఆధారంగా బ్యాంకు అకౌంట్లలోని సొమ్మును ఈజీగా తమ ఖాతాల్లోకి మల్లిస్తున్నారు నేరగాళ్లు.
బ్యాంకు సేవల పేరుతో వస్తున్న….ఫోన్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. అనుమానం వస్తే…వెంటనే బ్యాంకు సంబంధిత వెబ్ సైట్ లో నంబర్ ను చెక్ చేసుకోవాలంటున్నారు. ఫేక్ అని తేలితే… పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏ బ్యాంకు కూడా వ్యక్తిగత సమాచారం అయిన పిన్ నంబర్, సీవీవీ, కార్డు నంబర్లు అడగవని అలా అడిగితే అనుమానించాల్సిందేనంటున్నారు. చాలా మట్టుకు బ్యాంకు సంబంధిత వివరాల సమాచారం ఇచ్చే నంబర్లు… ఇంటరాక్టీవ్ వాయిస్ రెస్పాన్స్ లోనే ఉంటాయని సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా ప్రజలను అలర్ట్ చేస్తున్నామంటున్నారు పోలీసులు.