స్క్రాచ్ కార్డ్ లతో జాగ్రత్త..లేదంటే మన జేబుకు చిల్లే

స్క్రాచ్ కార్డ్ లతో జాగ్రత్త..లేదంటే మన జేబుకు చిల్లే

మీకు  స్క్రాచ్ కార్డ్ లపై మోజుంటే అప్రమత్తంగా ఉండండి. లేదంటే ఆ స్క్రాచ్ కార్డ్ లే మీ జేబుల్ని గుల్ల చేస్తాయి. సాధారణంగా గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేలలో మనం డబ్బుల్ని సెండ్ చేయడం కానీ, రిసీవ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటాం. కానీ మనలో కొంతమంది ప్రత్యేకించి  స్క్రాచ్ కార్డ్ ల కోసమే అవసరం ఉన్నా లేకపోయినా యూపీఐ ఆధారిత సేవల్ని వినియోగిస్తుంటారు.

దీన్ని ఆసరగా చేసుకుంటున్న కేటుగాళ్లు స్క్రాచ్ కార్డ్ లతో అకౌంట్ హోల్డర్లకు గాలం వేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.  యూపీఐ ఆధారిత సేవల్ని వినియోగించుకోవాలంటూ కొంతమంది కేటుగాళ్లు మన స్మార్ట్ ఫోన్లకు స్క్రాచ్ కార్డ్ లను సెండ్ చేస్తుంటారు. వాటిని స్క్రాచ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని, లేదంటే ఆఫర్లు సొంతం చేసుకోవచ్చని ఊరిస్తుంటారు.

ఎప్పుడైతే మన స్మార్ట్ ఫోన్ కి వచ్చిన స్క్రాచ్ కార్డ్ ను స్వైప్ చేస్తే మన అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ కేటుగాళ్ల బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్లిపోతుంటాయి. అలాంటి మాయగాళ్లను పట్టుకోవడం చాలా కష్టం. అందుకే స్క్రాచ్ కార్డ్ లపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని  పోలీసులు హెచ్చరిస్తున్నారు.