Heart Attack : నిశ్శబ్ద ముప్పు.. మహిళల్లో వచ్చే అసాధారణ గుండెపోటు లక్షణాలు ఇవే

Heart Attack : నిశ్శబ్ద ముప్పు.. మహిళల్లో వచ్చే అసాధారణ గుండెపోటు లక్షణాలు ఇవే

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి.  పెద్దవారే కాదు చిన్న పిల్లలు సైతం గుండెపోటుతో చనిపోతున్నారు. సాధారణంగా గుండెపోటు ( Heart attack )ను వైద్య పరిభాషలో మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని పిలుస్తారు. ఇది గుండెకు రక్త ప్రసరణ తీవ్రంగా తగ్గినప్పుడు లేదా పూర్తిగా నిలిచిపోయినప్పుడు సంభవిస్తుంది. దీనివల్ల ఆక్సిజన్ అందక గుండె కండరాలు దెబ్బతింటాయి. కరోనరీ ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి, అవి చిట్లి రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రవాహానికి అడ్డుపడి గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతుంటారు. 

 నార్త్ కరోలినాలోని UNC రెక్స్ హాస్పిటల్‌లో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ క్రిస్ కెల్లీ ప్రకారం, ఈ సంకేతాలు సాధారణంగా తక్కువగా కనిపించినా, ఇతర వ్యాధులతో తరచుగా ముడిపడి ఉంటాయని తెలిపారు. ఈ అమెరికన్ కార్డియాలజిస్ట్ గుండెపోటుకు సంబంధించిన కీలక హెచ్చరిక సంకేతాలను వెల్లడించారు. వీటిలో ఒకటి తరచుగా మహిళల్లో కనిపించినా, చాలామందికి అది గుర్తించబడకుండా పోతుందని ఆయన హెచ్చరించారు. వాటిల్లో ప్రధానంగా.. 

ఛాతీ నొప్పి , అసౌకర్యంగా 
 గుండెపోటుకు మొదటి, అత్యంత సాధారణ సంకేతం ఛాతీ నొప్పి. దీన్ని ఛాతీపై ఒత్తిడి, బిగుతుగా అనిపించడం, బరువుగా ఉండటం, కేవలం నొప్పిగా కూడా అనిపించడం.  ఛాతీలో ఏదైనా అసౌకర్యంగా అనిపించి, అది కొన్ని నిమిషాల తర్వాత కూడా తగ్గకపోతే, ముఖ్యంగా భుజాలు, చేతులు,  దవడకు నొప్పి పాకినట్లయితే ఇది చాలా ఆందోళన కలిగించే సంకేతం అని డాక్టర్ కెల్లీ వివరించారు. ఇలాంటి సమయంలో వెంటనే  వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

 శ్వాస ఆడకపోవడం
తరచుగా ఊపిరి అందకపోవడం కూడా గుండెపోటుకు సూచన అని డాక్టర్ కెల్లీ తెలిపారు. మీరు ఎలాంటి పని చేయకపోయినా, ఒక మైలు దూరం పరుగెత్తినట్లుగా అనిపిస్తే,  మీ గుండె సరిగా పనిచేయడానికి కష్టపడుతోందని, ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోతుందని అర్థం. కాబట్టి, ఆకస్మికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే, వెంటనే అత్యవసర విభాగానికి వెళ్లి పరీక్షించుకోవాలి అని అన్నారు.

కడుపు నొప్పి , వికారం
నిరంతర కడుపు నొప్పి లేదా పొత్తికడుపు నొప్పి, దానితో పాటు వికారం అనిపించడం గుండెపోటు లక్షణం కావచ్చని డాక్టర్ కెల్లీ హెచ్చరించారు. దీన్ని చాలామంది అజీర్ణంగా పొరబడుతుంటారు. చాలా విషయాలు కడుపు నొప్పికి కారణం కావచ్చు. అయితే గుండె జబ్బుల ప్రమాద కారకాలు ఉండి, 50 ఏళ్లు పైబడి ఉండి, ఆకస్మికంగా కడుపు నొప్పి, వికారం వచ్చి, మీకు ఏ మాత్రం బాగోలేదని అనిపిస్తే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఇది చాలా సాధారణం. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలిన అని ఆయన స్పష్టం చేశారు.

►ALSO READ | Fatty Liver: యువతలో ఫ్యాటీ లివర్ ముప్పు.. కాన్సర్ కు దారితీస్తుందా?.. పరిష్కారం లేదా?

ఛాతీ నొప్పితో పాటు, మరికొన్ని లక్షణాలు కూడా తక్షణ శ్రద్ధ అవసరం అని చెప్పారు.  వాటిల్లో ఛాతీలో అసౌకర్యం, పిండుతున్నట్లు అనిపించడం, బరువుగా ఉండటం వంటివి. ఇవి ఛాతీ నుండి ఎడమ చేయి, భుజం, మెడ, దవడ, వీపు, నడుము వైపు వ్యాపించవచ్చు. ఇతర లక్షణాలలో ప్రధానంగా నిద్ర పట్టకపోవడం, గుండె దడ, ఆందోళన,  తల తిరుగుతున్నట్లు అనిపించడం, మైకం వచ్చి పడిపోవడం వంటివి కూడా గుండె ప్రమాదాన్ని పెంచుతాయి. కనుక గుండెపోటు సంకేతాలను ఎప్పుడూ విస్మరించవద్దు. ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మీ ప్రాణాలను కాపాడగలదు.