Fatty Liver: యువతలో ఫ్యాటీ లివర్ ముప్పు.. కాన్సర్ కు దారితీస్తుందా?.. పరిష్కారం లేదా?

Fatty Liver: యువతలో ఫ్యాటీ లివర్ ముప్పు..  కాన్సర్ కు దారితీస్తుందా?.. పరిష్కారం లేదా?

ఆరోగ్య సమస్యలు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని వేధిస్తున్నాయి.  ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే పరిమితమైన కాలేయ వ్యాధులు ఇప్పుడు యవతను కూడా వెంటాడుతున్నాయి.  మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంగా యువత 'నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్' ( NAFLD ) అనే కొవ్వు కాలేయ వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు.   సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం  వంటి కారణాలతో యువతలో కాలేయంపై కొవ్వు పేరుకుపోతోంది.  దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే  అది నాన్ ఆల్కహాలిక్ స్టియాటో హెపటైటిస్ ( NASH ), లివర్ ఫైబ్రోసిస్ , సిరోసిస్ , చిరకు కాలేయ కాన్సర్ కు కూడా దారీతీసే అవకాశం ఉంది.

అయితే దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ సరైన వైద్య చికిత్స, జీవనశైలో కొన్ని మార్పులు చేసుకుంటే కొవ్వు కాలేయాన్ని తిప్పికొట్టి, చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.  కొవ్వు కాలేయంతో పోరాడటానికి జీవనశైలిలో తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం
కాలేయ ఆరోగ్యం ప్రధానంగా మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాలేయ వ్యాధులను నివారించడానికి మెడిటరేనియన్ డైట్ ఎంతో ప్రయోజనకరమని అనేక అధ్యయనాలు నిరూపించాయి. "జర్నల్ ఆఫ్ హెపటాలజీ" ప్రకారం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, ఆలివ్ ఆయిల్, చేపలు కాలేయానికి, మొత్తం ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ ఆహారంలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన చక్కెరలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల కాలేయంపై కొవ్వు తగ్గించడానికి ఇది సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శారీరక శ్రమ అవసరం..
"జర్నల్ ఆఫ్ హెపటాలజీ" నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, NAFLD, శారీరక శ్రమ లేకపోవడం కూడా కాలేయంపై కొవ్వుకు తేలింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేక ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా కాలేయ సమస్యలను అధిగమించడానికి ఒక శక్తివంతమైన మార్గం. వారానికి కనీసం 150 నిమిషాల తేలికపాటి నుండి తీవ్రమైన వ్యాయామం చేయడం, ఎక్కువ శారీరక కార్యకలాపాల్లో పాల్గొనడం మీ కాలేయానికి, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

శరీర బరువును తగ్గించడం.. కొవ్వు కాలేయానికి విరుగుడు
శారీరక శ్రమను పెంచుకుని, సమతుల్య ఆహారం తీసుకుంటే, సహజంగానే అదనపు కొవ్వు, బరువు తగ్గడం మొదలవుతుంది. క్రమంగా, స్థిరమైన బరువు తగ్గింపు కొవ్వు కాలేయాన్ని తిప్పికొట్టడానికి తోడ్పడుతుంది. ఇది నిజంగా శరీరంలో ఒక పరివర్తనాత్మక మార్పును తీసుకువస్తుంది.

తీపికి దూరం కాలేయానికి రక్షణ
అమెరికాకు చెందిన "నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్" ప్రకారం, చక్కెర వినియోగాన్ని తగ్గించడం ద్వారా కొవ్వు కాలేయం సమస్య నుంచి సులభంగా భయటపడవచ్చు. అధిక చక్కెర కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.  శీతల పానీయాలు,  తీపి పదార్థాలను పరిమితం చేయాలని వైద్య నిపుణులు సలహా ఇస్తారు. అలాగే, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు బదులుగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, తృణధాన్యాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

►ALSO READ | Hair fall : తుట్టెలు తుట్టెలుగా జుట్టు రాలిపోతుందా.. ? అయితే ఇవి తింటే చాలు!

బ్లాక్ కాఫీతో ప్రయోజనాలు
ముఖ్యంగా కాఫీలో చక్కెర, క్రీమ్ లేకుండా తాగే మంచిది.  బ్లాక్ కాఫీ, కాలేయ ఆరోగ్యానికి సానుకూల ప్రభావం చూపుతుంది. క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి, ఇవి కాలేయంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అధిక కెఫిన్ ఆరోగ్యానికి మంచిది కానప్పటికీ, అప్పుడప్పుడు కాఫీ తాగడం వల్ల NAFLD ఉన్నవారిలో కాలేయ ఎంజైమ్ స్థాయిలు తగ్గడం, కాలేయ వాపు తగ్గడం, లివర్ ఫైబ్రోసిస్ ప్రమాదం తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ మార్పులను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే, మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా, మొత్తం శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.  కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.