పబ్ జీ, బెట్టింగ్ యాప్సే కాదు.. లూడో గేమ్ కూడా ప్రాణాలు తీస్తోంది.. హైదరాబాద్లో రూ.5 లక్షలు పోగొట్టుకుని..

పబ్ జీ, బెట్టింగ్ యాప్సే కాదు.. లూడో గేమ్ కూడా ప్రాణాలు తీస్తోంది.. హైదరాబాద్లో రూ.5 లక్షలు పోగొట్టుకుని..

పబ్జీ గేమ్ ఎంత మంది పిల్లలు, టీనేజ్ యువకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత  బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఇప్పటికీ ఎంతో మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు నష్టపోతున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే వీటితో పాటు ఏదో సరదాగా ఇంటి పట్టున టైం పాస్ కు ఆడుకునే లూడో గేమ్ కూడా యువకుల ప్రాణాలు తీస్తోంది. అలా ప్రాణాలు పోగొట్టుకున్న హైదరాబాద్ యువకుని స్టోరే ఇది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గడ్డమీది వెంకటేష్ (23) అనే యువకుడు లూడో గేమ్ ఆడుతూ రూ.5 లక్షలు పోగొట్టుకున్నా. తీవ్ర నష్టాలతో ఏం చేయాలో తెలియక విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 

మహబూబ్ నగర్ జిల్లా నర్వా మండలం జక్లేర్ గ్రామానికి చెందిన వెంకటేష్ గత నాలుగేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. రోస్ట్ కేఫ్ లో గార్డెనర్ గా పనిచేస్తూ.. ఈజీ మనీ కోసం మొబైల్ యాప్ ద్వారా లూడో గేమ్ ఆడటానికి అలవాటు పడ్డాడు. అయితే ఈ గేమ్ లో నష్టాలు వస్తుండటంతో.. రెవెంజ్ ప్లేయింగ్ మొదలు పెట్టాడు. అంటే పోగొట్టుకున్న  డబ్బులు సంపాదించాలని ఎక్కువ పందెం కాస్తూ మళ్లీ ఆడటం.

ఆడే కొద్దీ డబ్బులు పోవడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఐదు లక్షల రూపాయల వరకు అప్పు చేశాడు. తనకు వచ్చే జీతానికి.. చేసిన అప్పులకు మోయలేని భారంగా భావించి.. అప్పు తీర్చలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

►ALSO READ | ముంబైతో లింకులున్న హైద్రాబాద్ డ్రగ్స్ ముఠా అరెస్టు..

కేవలం 23 ఏళ్ల వయసులో జీవితాన్ని ముగించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని తోపాటు ఎంత మంది ఆడారు.. అనే కోణంలో విచారిస్తున్నారు. 

సింపుల్ గేమ్స్ అని.. అప్పు తెచ్చి మరీ ఆటలు ఆడుతూ జీవితాలను రిస్క్ లో పడేసుకుంటున్నారు యువతీయువకులు. గ్యాంబ్లింగ్ మొదట్లో డబ్బులు వచ్చినట్లే అనిపించినా.. ఆ పోవడం మొదలు పెడితే కోలుకోలేని దెబ్బ తీస్తాయి. తెలివితో సంపాదించాలి కానీ.. ఈజీ మనీ పేరున ఇలాంటి చట్ట విరుద్ధమైన ఆటలు ఆడి జీవితం నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.