అమ్రాబాద్, వెలుగు: అటవీ ప్రాంతంలో మేకలు కాస్తూ అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్న చెంచు యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం పెట్రాల్ చెను గ్రామానికి చెందిన చిగుర్ల ప్రశాంత్ గురువారం గ్రామస్తులతో కలిసి సమీప అటవీ ప్రాంతంలోని చిన్న బోడ్ వద్ద మేకలు కాస్తున్నాడు. ఈ క్రమంలో కుంకుడు కాయలు సేకరించేందుకు చెట్టు వద్దకు వెళ్లగా, పిల్లలు కలిగిన ఎలుగుబంటి అకస్మాత్తుగా దాడి చేసింది.
పక్కనే ఉన్న వారు గమనించి అరుస్తూ ఎలుగుబంటిని తరిమారు. దీంతో అది ప్రశాంత్‌ను వదిలి అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఈ దాడిలో ప్రశాంత్ చేతికి తీవ్రమైన గాయాలు కాగా, ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. బాధితుడికి ఐటీడీఏ ద్వారా వైద్య సాయం, ఆర్థిక సాయం అందించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
