తిరుమలలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఎలుగుబంటి కనిపించడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. వినాయకస్వామి ఆలయం పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి వాహనదారులను అలెర్ట్ చేశారు.
రాత్రి వేళల్లో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండటంతో భక్తుల భద్రత కోసం టీటీడీ అధికారులు ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఘాట్ రోడ్లలో లైటింగ్, గస్తీ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వన్యప్రాణుల కదలికలపై అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
