జనంలో భయం.. కరోనా బుగులుతో ఇళ్ల నుంచి బయటకెళ్తలేరు

జనంలో భయం.. కరోనా బుగులుతో ఇళ్ల నుంచి బయటకెళ్తలేరు

ఇండ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం భయపడుతున్నారు. ఎవరి నుంచి ఎప్పుడు ఎట్ల కరోనా అంటుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎవరూ షాపింగ్ చేస్తలేరు..  ఔట్​సైడ్​ ఫుడ్​ తింటలేరు.. బస్సులు, ఆటోలు, క్యాబ్​లు నడుస్తున్నప్పటికీ వాటిలో ఎక్కుతలేరు.. అన్నీ బంద్ పెట్టిన్రు. ఏమైనా కావాల్సి వస్తే ఆన్​లైన్​లోనే కొనుక్కుంటున్నారు. చివరికి కూరగాయలు కూడా ఫోన్​లోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ఎటన్నా అర్జెంట్​గా పోవాల్సి వస్తే  సొంత వెహికల్స్​నే వాడుతున్నారు. కరోనా సోకితే ప్రభుత్వ హాస్పిటల్స్​లో సరైన ట్రీట్​మెంట్​ అందుతుందన్న నమ్మకం జనంలో  పోయింది. ప్రైవేటులోనైనా ట్రీట్​మెంట్​ చేయించుకుందామంటే  చేతుల్లో డబ్బుల్లేవ్​. కనీసం డౌట్​ వచ్చి టెస్టులు చేయించుకుందామన్నా చేసే దిక్కు లేదు. దీంతో చాలా మంది ఇండ్లకే పరిమితమవుతున్నారు.

హైదరాబాద్‌‌, వెలుగు:కరోనా భయంతో జనాలు ఇండ్లలోంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఒకవేళ వైరస్‌‌ సోకితే కనీసం టెస్టులు చేసే పరిస్థితి లేకపోవడం.. టెస్టులు చేసినా సర్కారీ దవాఖానాల్లో సరైనా ట్రీట్‌‌మెంట్‌‌ అందకపోవడం వంటి కారణాలతో గడప దాటడం లేదు. ఆక్సిజన్‌‌ సిలిండర్లు పెట్టట్లేదని, ఊపిరి అందడం లేదని పేషెంట్లు సెల్ఫీ వీడియోలు పోస్టుల చేయడం, తర్వాత కొన్ని గంటల్లోనే వాళ్లు చనిపోయారంటూ వార్తలు రావడం.. ప్రైవేటు హాస్పిటళ్లకు పోతే మోయలేనంత బిల్లులు.. కరోనాతో చనిపోతే శవాన్ని తాకడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం వంటివి ప్రజల్లో నెలకొన్న భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. దీంతో చాలా మంది గడప దాటడం లేదు. ఏదైనా పెద్ద అవసరం పడితేనే వెళ్తున్నారు. జనంలో పెరిగిన భయంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రజలతో కిటకిటలాడిన షాపింగ్‌‌ మాల్స్‌‌, హోల్‌‌సేల్‌‌ షాపులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కరోనా భయం లక్షలాది మంది ప్రజల ఉపాధిపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఉన్నదే తిందాం

కరోనా కంటే ముందు రెస్టారెంట్లలో రోజు గిరాకీ ఉండేది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లతోపాటు నేషనల్, స్టేట్ హైవేలపై ఎప్పుడూ హోటళ్లు తెరిచే ఉండేవి. రద్దీతో కళకళలాడేవి. హైదరాబాద్లో గంట కూడా గ్యాప్ లేకుండా రోజంతా నడిచే బిర్యానీ హౌజ్లు పదుల సంఖ్యలో ఉండేవి. కానీ కరోనాతో అంతా మారిపోయింది. పెద్ద బ్రాండ్ హోటళ్లు, ఫుడ్ సెంటర్లకు అసలు వ్యాపారమే లేదు. హైదరాబాద్లో బిర్యానీకి బ్రాండ్ ఉండే ప్యారడైజ్ హోటల్లోనూ కరోనా ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది. లాక్ డౌన్ సడలింపులు ఉన్నా జనం ఎవరూ బయటి తిండికి ఆసక్తి చూపడంలేదు. గతంలో ఏదైనా పని కోసం నగరాలు, పట్టణాలకు వెళ్లినప్పుడు అక్కడే తినేటోళ్లు. కానీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఇంటి దగ్గరి నంచి బాక్సు, వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నారు. మాములు సందర్భాల్లో బాగా నడిచే బట్టల షాపులు, రెస్టారెంట్లపైనే ఇప్పుడు ఎక్కువ ప్రభావం పడిందని హైదరాబాద్లోని రెస్టారెంట్అసోసియేషన్ ప్రతినిధి నరేశ్ కుమార్ తెలిపారు.

క్యాబ్‌‌లు, ఆటోలు ఎక్కుతలేరు

లాక్‌‌డౌన్‌‌కు ముందు గ్రేటర్‌‌ హైదరాబాద్‌లో 1.20 లక్షల క్యాబ్‌‌లు, మూడు లక్షల ఆటోలు తిరిగేవి. రోజుకు 10 లక్షల మందికి పైగానే వీటిలో ప్రయాణించే వారు. సర్కారు అన్‌‌లాక్‌‌ -1లో భాగంగా ఆటోలు, క్యాబ్‌‌లకు ఆంక్షలతో కూడిన పర్మిషన్లు ఇవ్వడంతో మొదట్లో దాదాపు అన్ని క్యాబ్‌‌లు, ఆటోలు రోడ్లపైకి వచ్చాయి. పొద్దంతా ఎదురు చూసినా ఒకటి, రెండు కిరాయిలు కూడా దొరక్కపోవడంతో చాలా మంది బండి బయటికి తీయడమే మానేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో 60 వేల వరకు క్యాబ్‌‌లు, 50 వేల వరకు ఆటోలు తిరుగుతున్నట్టు ట్రాన్స్‌‌ పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

నో షాపింగ్

జనం తిండి తర్వాత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది బట్టలకే. కానీ 4 నెలలుగా ఎక్కువ మంది జనం కొత్త బట్టల జోలికే పోవడంలేదు. కేవలం మాస్కులు కొనుక్కోవడానికే వెళ్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు ఉంటే తప్ప ఎవరూ బట్టల దుకాణాలకు వెళ్లడంలేదు. షాపింగ్ మాల్స్‌కు అసలే వెళ్లడం లేదు. ఎక్కువ ఖర్చు నిత్యావసరాలకే పెడుతున్నారు. ’‘వీకెండ్స్లో మాల్ ఫుల్ అయ్యేది. లోపల ఉన్న వాళ్లు వెళ్లడానికి ఒక్కోసారి రాత్రి 11 అయ్యేది. మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గిరాకీ బాగానే ఉండేది. ఇప్పుడు అంతా మారిపోయింది. జనం రావడంలేదు’ అని హైదరాబాద్‌లోని బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రతినిధి ఒకరు తెలిపారు. షాపింగ్‌కు వచ్చే వాళ్లు కూడా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునే బట్టలను కొంటున్నారు.

ఇంటి నుంచే పని

ఐటీ కంపెనీలతోపాటు వివిధ ప్రైవేటు సంస్థల ఉద్యోగులు వర్క్‌‌ ఫ్రమ్ హోమ్‌‌కే మొగ్గు చూపుతున్నారు. మొదట్లో ఐటీ కంపెనీలు మాత్రమే వర్క్‌‌ ఫ్రమ్ హోమ్‌‌ ఆఫర్‌‌ చేయగా, ఇప్పుడు చాలా ప్రైవేటు సంస్థల ఉద్యోగులు తాము ఇంటి నుంచే పని చేస్తామని తేల్చిచెప్తున్నారు. మల్టీ టాస్కింగ్‌‌ స్కిల్స్‌‌ ఉన్న ఉద్యోగులను అనవసరంగా ఆఫీస్‌‌ వరకు పిలిపించి ఇబ్బంది పెట్టడం కన్నా వర్క్‌‌ ఫ్రం హోమ్‌‌ ఇవ్వడానికి ఆయా కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఉద్యోగులను ఆఫీస్‌‌లకు చేరవేసే క్యాబ్‌‌లకు పూర్తిగా పనిలేకుండా పోయింది. ఆయా కంపెనీల్లోని క్యాంటీన్లు, కాఫిటేరియాలు మూతపడ్డాయి. అవే సంస్థలపై ఆధారపడ్డ ఫోర్త్‌‌ క్లాస్‌‌ ఎంప్లాయీస్‌‌, ఔట్‌‌ సోర్సింగ్‌‌ సర్వీసెస్‌‌లో పనిచేస్తున్న వారికి పనిలేకుండా పోయింది. ఫలితంగా లక్షలాది మంది ఇండ్లకే పరిమితయ్యారు.

సవారీలు వస్తలేవ్‌‌

లోన్‌‌లో కారు తీసుకొని నడుపుకుంటున్న. రోజులో 18 గంటలు యాప్‌‌ ఓపెన్‌‌ చేసి పెట్టినా రెండు, మూడు సవారీలు కూడా వస్తలేవు. లాక్‌‌డౌన్‌‌కు ముందు ఒక్కో రోజు రూ.3 వేల వరకు సంపాయించేవాడ్ని. ఇప్పుడు ఏడెనిమిది వందలు కూడా వస్తలేవు. లాక్‌‌డౌన్‌‌ టైంలో బండి బయటికే తీయలే. ఇప్పుడు కారు తీసినా సవారీలు రాక బ్యాంక్‌‌ కిస్తీలు కట్టుడు కష్టమైతంది. రోడ్‌‌ ట్యాక్స్‌‌ కట్టుడు తప్పేట్టు లేదు. మాఫీ చేయాలని అడిగినా సర్కారోళ్లు పట్టించుకుంటలేరు. మేం ఎట్ల బతకాలే.

-కరణం ప్రసాద్, క్యాబ్ డ్రైవర్, ఉప్పల్

భయపడుతూ బండ్లు నడుపుతున్నం

కార్లు, ఆటోలు నడిపే 4 వేల మందికి కరోనా వచ్చింది. భయంభయంగా బండ్లు నడుపుతున్నం. ప్రభుత్వం హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ కల్పించాలి. క్యాబ్‌‌ డ్రైవర్లకు కిరాయిలే దొరుకుత లెవ్వు. వచ్చే రెండు, మూడు కిరాయిల్లో 20 శాతం కమిషన్‌‌ రూపంలో కంపెనీనే తీసుకుంటుంది. కంపెనీలు మా గురించి ఆలోచించాలి. ఐదు శాతమే కమిషన్‌‌ తీసుకోవాలి.

– సలావుద్దీన్, చైర్మన్,    తెలంగాణ ట్యాక్స్ అండ్ డ్రైవర్స్ జేఏసీ

రోడ్లు ఖాళీ

హైదరాబాద్‌లో చిన్నాచితక పనులు చేసుకునే 20 లక్షల మందికి పైగా సొంతూళ్లకు వెళ్లిపోయారు. వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ ఇవ్వడంతో 2 లక్షల మందికిపైగా సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు ఊళ్లకు వెళ్లారు. ఇతర ప్రైవేట్‌ సెక్టార్‌ ఉద్యోగులు సైతం తమ ఊరి నుంచే పనులు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడంతో జూన్‌ మొదటి వారంలోనే ఎక్కువ మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టే అవకాశమున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో మరో 10 లక్షల మంది వరకు హైదరాబాద్‌ విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. బేగంపేట, సికింద్రాబాద్‌, సీటీసీ, రసూల్‌పుర, నల్గొండ క్రాస్‌రోడ్స్‌, రవీంద్రభారతి పరిసర ప్రాంతాల్లోని కెమెరాల ద్వారా ట్రాఫిక్ ను అనలైజ్ చేయగా లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే సగానికి సగం వెహికల్స్‌ మూవ్‌మెంట్‌ తగ్గినట్టుగా పోలీసులు చెప్తున్నారు.

బిజినెస్ గజిబిజి

లాక్‌డౌన్‌ పెట్టిన మొదట్లో కిరాణా, సూపర్‌ మార్కెట్లలో బిజినెస్‌ ఎక్కువే జరిగింది. అన్‌లాక్‌ తర్వాత ఈ వ్యాపారాలు కూడా డల్‌ అయ్యాయి. మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టబోతున్నట్టుగా ప్రకటించిన తర్వాత రెండు, మూడు రోజులు షాపుల ముందు హడావుడి కనిపించినా తర్వాత బిజినెస్‌ డల్‌ అయినట్టు వ్యాపారులు చెప్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లాత్‌ స్టోర్స్‌, ఫర్నిచర్‌ షాపులు, హోం అప్లయెన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ అప్లయెన్సెస్‌, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు, కర్రీ పాయింట్లు, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లు ఏవీ సరిగా నడవడం లేదు. స్టూడెంట్స్‌, చిరుద్యోగులు సొంతూళ్లకు పోవడంతో టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులకు పనిలేకుండా పోయింది.

ఎన్నడూ ఇట్ల ఉండలే..

20 ఏండ్లుగా టైలర్ షాప్ నిర్వహిస్తున్న. ఎప్పుడూ పరిస్థితి ఇంత అధ్వానంగా లేదు. ఇంతకుముందెప్పుడు ఇలాంటి స్థితి చూడలేదు. లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చాలా చితికి పోయాం. కొత్త బట్టలు ఎవ్వరూ కుట్టించుకుంటలేరు. గిరాకీ లేక షాప్ కిరాయి కట్టుడే కష్టమైతంది. కుటుంబ పోషణ భారంగా మారింది.

– కీర్తి రమేశ్‌, టైలర్, ముషీరాబాద్, హైదరాబాద్​

బండ్లు సర్వీసింగ్‌ చేయిస్తలేరు

45 రోజుల్నుంచి షాపు తీస్తున్న. గతంలో రోజుకు మూడు బండ్లు సర్వీసింగ్‌కు తెచ్చేటోళ్లు. చాలా మంది రెగ్యులర్‌ కస్టమర్లు ఉండేటోళ్లు. లాక్‌డౌన్‌తో కొందరు వెళ్లిపోయిండ్రు.. ఇంకొందరు ఉన్నా వచ్చి చిన్న రిపేర్లు చేయించుకుంటున్నారు. సర్వీసింగ్‌ మాత్రం చేయిస్తలేరు.. పైసలు లేవంటున్నారు. షాపు కిరాయి కూడా ఎల్తలేదు.

– అశోక్‌, మెకానిక్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్​