కార్తికేయ హీరోగా క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బెదురులంక 2012’. నేహా శెట్టి హీరోయిన్. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ఆగస్టు 25న సినిమా విడుదల కానున్న సందర్భంగా కార్తికేయ ఇలా ముచ్చటించారు.
‘‘కొవిడ్ టైమ్‌లో క్లాక్స్ నాకు ఈ కథ చెప్పాడు. అప్పట్లో ప్రపంచం ఏమవుతుందో అనే అయోమయంలో ఉన్నాం. దాంతో ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాను. కథలో కొత్తదనం, ఎంటర్‌టైన్మెంట్ ఉండటంతో ఓకే చేశా. కొత్త తరహా కథ కనుక ఎలాంటి రిఫరెన్స్‌లు లేవు. దీంతో సినిమా పూర్తయ్యాక చూసి హ్యాపీ ఫీలయ్యా. ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయి. ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సన్నివేశాలు, డైలాగులు ఉంటాయి. సినిమా చూసిన వాళ్లలో చిన్న మార్పు వస్తుందని నమ్ముతున్నా. సిట్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు శివ. తనకు నచ్చినట్లు జీవిస్తాడు.
సిటీలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి ఊరు వస్తాడు. తనను ఎవరైనా జడ్జ్ చేస్తున్నారా లాంటివేమీ పట్టించుకోడు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తనకు నచ్చిన పని తాను చేసుకుంటాడు. మరోవైపు తన ఊరు మాత్రమే తెలిసిన సర్పంచ్ కూతురుగా నేహాశెట్టి కనిపిస్తుంది. ప్రేమించిన అబ్బాయికి ఐ లవ్ యు చెప్పడానికి భయపడే అమ్మాయి. మా మధ్య సీన్స్ క్యూట్‌గా ఉంటాయి. మణిశర్మ గారి సంగీతం సినిమాకు ఎంతో ప్లస్ అయింది. ‘వలిమై’ తర్వాత తమిళంలో నాకు గుర్తింపు వచ్చింది కదా అని నా ప్రతి సినిమాను అక్కడ విడుదల చేయాలనుకోవడం లేదు. రెండు చోట్లా మెప్పించే కథ వస్తే బైలింగ్వల్ చేస్తాను.
అలాగే కొత్త చిత్రాల కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాను. ఏదో ఒక సీన్, స్టోరీ పాయింట్ అని కాకుండా ప్రతి సీన్ ఎగ్జైట్ అయినప్పుడు మాత్రమే చేస్తున్నా. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ సంస్థలో ప్రశాంత్ అని కొత్త దర్శకుడితో ఓ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ అండ్ క్రైమ్ కామెడీ జానర్‌లో ఉంటుంది’’.