- వచ్చే ఏడాది ఓపెన్ చేస్తామన్న హామీ నెరవేరేనా?
- సివిల్ పనులపై డీపీఆర్ రెడీ చేస్తున్న ఆఫీసర్లు
- గద్వాల జిల్లాలో ఏటేటా పెరుగుతున్న ఆయిల్ పామ్ సాగు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర ఏర్పాటు చేస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీ పనులు ముందుకు పడడం లేదు. వచ్చే ఏడాది ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ, ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉండడంతో ఫ్యాక్టరీ ఓపెనింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు కూడా సివిల్ పనులే ప్రారంభం కాకపోవడం, ప్రస్తుతం ఫ్యాక్టరీ ఆవరణలోని గోదాంలలో వడ్లు నిల్వ ఉంచడం చూస్తుంటే పనులు ఇప్పట్లో ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. సివిల్ పనులు పూర్తి చేసి, మెషీన్లు, ఇతర పరికరాలు రావడానికి మరింత టైం పట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇదిలాఉంటే జిల్లాలో ప్రతి ఏడాది ఆయిల్ పామ్ సాగు పెరుగుతోంది.
ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల హడావుడి..
అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు బీచుపల్లి దగ్గర రూ.200 కోట్లతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేస్తామని హడావుడి చేశారు. అప్పటి అగ్రికల్చర్ మినిస్టర్ ఫ్యాక్టరీ పనులకు భూమిపూజ కూడా చేశారు. ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,800 మందికి ఉపాధి లభిస్తుందని గొప్పలు చెప్పుకున్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఫ్యాక్టరీ మూత పడిన విషయాన్ని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక దాని ఊసెత్తకపోవడంతో పనులు ముందుకు పడలేదు. రెండోసారి గెలిచాక కూడా ఎలాంటి పనులు చేయకుండా.. అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడి చేశారు.
10 వేల ఎకరాల కాపు కాసే తోటలు కావాలి..
బీచుపల్లి దగ్గర ఏర్పాటు చేసే ఆయిల్ మిల్ హై టెక్నాలజీతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిని రెండు షిఫ్ట్‌లలో నడపాలంటే కాపుకు వచ్చిన 10 వేల ఆయిల్ పామ్ తోటలు ఉండాలి. గంటకు 30 టన్నుల గెలలను క్రష్ చేసే కెపాసిటీ ఉన్న ఆయిల్ మిల్లును ఇక్కడ నెలకొల్పనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక్కడి మిల్లుకు గద్వాలతో పాటు నారాయణపేట జిల్లాను కూడా అటాచ్ చేశారు.
ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లాలో 6,742 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. నారాయణపేట జిల్లాలో కూడా అదే స్థాయిలో ఆయిల్ పామ్ తోటలు సాగు చేసినట్లు హార్టికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ పంట పూర్తి స్థాయి కోతకు వచ్చేసరికి ఇక్కడ మిల్లును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
డీపీఆర్ రెడీ చేస్తున్రు..
బీచుపల్లి దగ్గర పాత ఆయిల్ మిల్లుకు సంబంధించిన బిల్డింగులు, గోదాంలు, షెడ్లు, ఇతర నిర్మాణాలను ఆఫీసర్లు పరిశీలించారు. పనికి వచ్చే వాటిని పక్కన పెట్టి మిగిలిన నిర్మాణాలు డిస్ మెటల్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఇటీవలే నిపుణుల బృందం తనిఖీ చేసింది. ఈ క్రమంలో డీపీఆర్ ఇవ్వాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అధికారులు ఆదేశించారు. త్వరలోనే డీపీఆర్ ఇవ్వనుండగా, ముందుగా సివిల్ పనులు పూర్తి చేసి, ఆ తరువాత మెషినరీపై దృష్టి పెట్టనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
నష్టాల పేరుతో 2003లో మూసివేత..
ఇటిక్యాల మండలం బీచుపల్లి దగ్గర ఏర్పాటు చేసిన విజయ ఆయిల్ మిల్లను నష్టాల పేరుతో 2003లో అప్పటి ప్రభుత్వం మూసివేసింది. దీంతో అందులో పని చేసే కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీ తిరిగి తెరవాలని ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అందులో పని చేసే కార్మికులు, ఉద్యోగులు ఇతర పనులు చూసుకున్నారు.
ఈక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పెరగడంతో రూ.200 కోట్లతో విజయ ఆయిల్ మిల్లును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్డీడీబీ వద్ద ఉన్న రూ.36 కోట్ల అప్పును 8.40 కోట్లకు వన్ టైం సెటిల్మెంట్ చేశారు. ఆయిల్ ఫెడ్ సంస్థను ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పించారు. కానీ, ఇప్పటివరకు ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు ప్రారంభించక పోవడంతో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..
ఆయిల్ మిల్ పనులపై ఆఫీసర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముందు సివిల్ పనులపై దృష్టి పెడతాం. డీపీఆర్ వచ్చాక, ఫ్యాక్టరీ పనులపై క్లారిటీ వస్తుంది.- వెంకటేశ్, ఆయిల్ ఫెడ్ మేనేజర్
