సబ్జెక్ట్​ టీచర్ల డిప్యూటేషన్లు ఎప్పుడు..

సబ్జెక్ట్​ టీచర్ల డిప్యూటేషన్లు ఎప్పుడు..

మెట్ పల్లి, వెలుగు : జిల్లాలో స్కూళ్లు మొదలై  ఇరవై రోజులు  అవుతున్నా..  ఇప్పటికీ  సబ్జెక్ట్​  టీచర్ల అడ్జెస్ట్ మెంట్ జరగలేదు. గతేడాది  విద్యా సంవత్సరంలో   హై స్కూళ్లకు   డిప్యూటేషన్ పై పంపగా సమస్య కొంత తీరింది. ఈ ఏడాది కూడా సబ్జెక్ట్​ టీచర్లను కేటాయించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు  పడుతున్నారు.మరోవైపు  టీచర్ల కొరత ఉన్న స్కూళ్లకు ఎస్జీటీలను కేటాయించడం ద్వారా ప్రైమరీ స్కూళ్లలో స్టాఫ్​ తగ్గే అవకాశం ఉంది.       సరైన స్థాయిలో  టీచర్లు అందుబాటులో లేకపోవడంతో  విద్యార్థులు,  తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పెరుగుతున్న సమస్య 

మన ఊరు - మన బడితో స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం అంటున్నా..  టీచర్లను నియమించడంతో బడులు కళ తప్పుతున్నాయి. విద్యాశాఖ రూల్స్ ప్రకారం స్కూళ్ళలో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలి.కానీ, ఎనిమిదేళ్లుగా ప్రమోషన్లు, ఐదేళ్లుగా బదిలీలు  చేయకపోవడం, కొత్తగా నియామకాలు లేకపోవడంతో  విద్యార్థులు ఇబ్బందులు  పడుతున్నారు.  గతంలో టీచర్లు లేని స్కూళ్లలో  స్టూడెంట్ల చదువులకు ఇబ్బందులు కలగకుండా విద్యా వాలంటీర్లతో నెట్టుకొచ్చేవారు. కానీ గత రెండేళ్లనుంచి సర్కారు విద్యా వాలింటర్లను నియమించడం నిలిపివేయడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది.   

 పోస్టులు 3915... ఖాళీలు 663

జగిత్యాల జిల్లాలో మొత్తం 783 సర్కారు స్కూళ్లలో  3,915  టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 3,252 మంది పనిచేస్తుండగా 663 ఖాళీలు ఉన్నాయి. వీరిలో 197 మందిని వివిధ స్కూళ్లలో అడ్జెస్ట్ చేశారు. ప్రమోషన్ల తర్వాత ఖాళీల సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం జిల్లాలో స్టూడెంట్స్ కు చదువు చెప్పేందుకు సరిపడా సబ్జెక్ట్ టీచర్లులేకపోవడంతో హై స్కూళ్లలో చదువుకునే స్టూడెంట్స్ఇబ్బంది పడుతున్నారు.  వీలైనంతవరకూ సబ్జెక్ట్​ టీచర్లను డిప్యూటేషన్లపై సర్దుబాటు చేస్తున్నా సమస్య పూర్తిగా తీరడం లేదు. 

 డిప్యుటేషన్లలో అక్రమాలు

టీచర్లు పోస్టులు ఖాళీగా ఉన్న స్కూళ్ళలోడిప్యుటేషన్ పై టీచర్ల అడ్జెస్ట్ మెంట్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో గత ఏడాది చేసిన అడ్జెస్ట్ మెంట్లలో రాజకీయ పలుకుబడి, సంఘాల నాయకులు అండతో కొందరు తమకు అనుకూలంగా ఉన్న స్కూళ్ళలోడిప్యూటేషన్ వేయించుకొని డ్యూటీలు సరిగా చేయడం లేదని ఆరోపణలున్నాయి.జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి డిప్యూటేషన్ ప్రక్రియ రూల్స్ కు అనుగునంగా చేయాలని టీచర్లు కోరుతున్నారు.

ALSO READ:యువకుడి కిడ్నాప్ కు యత్నించిన పొలిటికల్ లీడర్ అరెస్ట్

చర్యలు తీసుకుంటాం

జిల్లాలో ప్రైమరీ, హై స్కూళ్లలో 663 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆయా స్కూళ్ళలో చదివే స్టూడెంట్ల చదువులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. స్టూడెంట్లు ఎక్కువగా ఉన్న స్కూళ్ళలో టీచర్లను అడ్జెస్ట్ చేస్తాం. గత ఏడాది చాలా మందిని అడ్జెస్ట్ చేశాం. ఈ ఏడాది ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం.

– జగన్మోహన్ రెడ్డి, డీఈవో , జగిత్యాల