వసంతపంచమి అని మొదటి రోజే నామినేషన్ వేశా

వసంతపంచమి అని మొదటి రోజే నామినేషన్ వేశా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఫిబ్రవరి-16 నుంచి 23 వరకు నామినేషన్లు అధికారులు స్వీకరించనున్నారు.  ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఎమ్మెల్సీ నియోజక పరిధిలో 5.60 లక్షల ఓటర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మూడవ అంతస్తులో ఉన్న రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాకి  అభ్యర్థులు నామినేషన్‌ను అందించనున్నారు. మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిన్నారెడ్డి ఫస్ట్ నామినేషన్‌ను వేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చిన్నారెడ్డి..  ఒకసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. మొదటి రోజునే వసంతపంచమి అని నామినేషన్ దాఖలు చేశానన్నారు. ఈ ఎన్నికల్లో నాలుగు ప్రాధాన్యత అంశాలు ఉన్నాయన్న ఆయన..అందులో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు.  ఈ ఏడు సంవత్సరాల్లో నాలుగు వర్గాలు దగాకు గురయ్యామని తమకు న్యాయం జరగలేదన్నారు. 1,91 000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ఏ ఒక్క ఉద్యోగం నింపలేదన్నారు.  7 ఏళ్లలో 2018 ఎన్నికలప్పుడు ఉద్యోగాలను ఇవ్వకపోయినా నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారన్నారు. ఇప్పటివరకు నిరుద్యోగ భృతి లేదన్నారు.

ఉపాధ్యాయులకు పీఆర్సీ రాలేదని ఐఆర్ రాలేదన్నారు. ప్రమోషన్స్ రాలేదని.. భాషాపండితుల సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇటీవల 7.5 ఫిట్మెంట్ పీఆర్ సీలో ప్రకటిస్తే ఉద్యోగులంతా నిరుత్సాహానికి గురయ్యారని తెలిపారు. ఫిట్మెంట్ పెంచితే ఉద్యోగస్తులకు పెంచుతాం.. కానీ టీచర్లకు పెంచమని లీకులు ఇస్తున్నారన్నారు. పంచాయతీ రాజ్ ఫీల్డ్ అసిస్టెంట్లు, రెవిన్యూ వీఆర్వోలను ఒక్క కలం పోటుతో ఇంటికి పంపించారని..విశ్రాంత ఉద్యోగులు ఇన్కమ్ టాక్స్ నుండి మినహాయింపు కావాలని కోరుతున్నారన్నారు. 5 లక్షల నుండి పది లక్షల వరకు ఉద్యోగులకు ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరినా.. అది నెరవేరలేదన్నారు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిన్నారెడ్డి.