ఆర్మీ మీద జోక్ చైనాలో కామెడీ కంపెనీకి 17 కోట్ల ఫైన్

ఆర్మీ మీద జోక్ చైనాలో కామెడీ కంపెనీకి 17 కోట్ల ఫైన్
  • తదుపరి ప్రదర్శనలపైనా నిషేధం
  • కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరిక

బీజింగ్: పీపుల్స్  లిబరేషన్  ఆర్మీ (పీఎల్ఏ) పై జోక్  వేసినందుకు చైనాలో ఓ కామెడీ కంపెనీకి ప్రభుత్వం రూ.17.50 కోట్ల జరిమానా వేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఆ కంపెనీ నిర్వహించనున్న ప్రదర్శనలపైనా నిషేధం విధించింది. ఆ కంపెనీపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్టాండప్  కమెడియన్  లీ హవోషీ .. హౌస్  పేరుతో కామెడీ షోలు నిర్వహిస్తుంటాడు. ఇటీవలే ఓ షోలో అతను తన కుక్కపిల్లల గురించి మాట్లాడాడు. ఉడతను తరుముతున్న తన కుక్క పిల్లలకు యుద్ధాల్లో గెలిచే సామర్థ్యం ఉందని అన్నాడు. అనంతరం చైనా సోషల్  మీడియాలో బీబో ఈ షో వైరల్​గా మారింది. దీంతో బీజింగ్  మునిసిపల్  కల్చర్  అండ్ టూరిజం బ్యూరో లీ కామెంట్లపై సీరియస్  అయింది. లీ కంపెనీపై దర్యాప్తు చేసింది. అతను చేసిన వ్యాఖ్యలు ఆర్మీని కించపరిచేలా ఉన్నాయని, అలా వ్యాఖ్యలు చేసి చట్టాలను అతను ఉల్లంఘించాడని బ్యూరో పేర్కొంది. దీంతో లీ కంపెనీకి రూ.17.50 కోట్ల జరిమానా విధించింది. ‘‘కామెడీ ప్రదర్శనలు జాతీయ భావాలను దెబ్బతీయరాదన్న నిబంధనలను లీ ఉల్లంఘించాడు. దేశ గౌరవాన్ని దిగజార్చాడు. జాతీయ భద్రత, ప్రజల శాంతి భద్రతలను కాపాడే పీఎల్ఏపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని సహించం. పీఎల్ఏ ఇమేజీని, ప్రజల మనోభావాలను దిగజార్చే వారిపై చర్యలు తీసుకుంటం” అని టూరిజం బ్యూరో తెలిపింది.

తప్పు ఒప్పుకున్న లీ 

ఆర్మీపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పే అని లీ హవోషీ పేర్కొన్నాడు. ఆర్మీపై తాను వేసిన జోక్  నిజంగా అభ్యంతరకరమని అతను ఒప్పుకున్నాడు. ఇందుకు క్షమాపణలు తెలిపాడు. ఈ మేరకు వీబోలో ఓ ప్రకటన విడుదల చేశాడు. కాగా ఆరోజు లీ చేసిన షోను ఏడు కోట్ల మంది చూశారు. అతను చేసింది తప్పే అని, ప్రభుత్వం ఆయనకు జరిమానా విధించడం కరెక్టే అని చాలా మంది కామెంట్లు చేశారు.