వరల్డ్ రికార్డ్ : వేలంలో కోట్లు పలికిన పావురం

వరల్డ్ రికార్డ్ : వేలంలో కోట్లు పలికిన పావురం

వందలు.. వేలు.. లక్షలు కాదు ఏకంగా ఓ పావురాన్ని కోట్లు పెట్టి సొంతం చేసుకున్నాడో బడా బాబు. న్యూ కిమ్ గా పిలిచే ఈ ఆడ రేసింగ్ పావురాన్ని చైనాకు చెందిన ఓ వ్యక్తి రూ. 1.6 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14.11 కోట్లు) చెల్లించి పావురాన్ని వేలంలో దక్కించుకున్నాడు. బెల్జియంలోని పీజియన్ పారడైజ్ (పిపా) అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఈ పావురం రూ.14కోట్ల రికార్డు ధర పలికింది.

రెండేళ్ల వయసున్న న్యూ కిమ్ ను 200 యూరోల బేస్ ప్రైస్‌ తో వేలానికి పెట్టగా 1.6 మిలియన్ యూరోలకు అమ్ముడుపోవడంతో ప్రపంచమంతా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటి వరకు ప్రపంతవ్యాప్తంగా అధికారికంగా ఎక్కడా ఇంత భారీ స్థాయి ధరకు ఓ పావురం అమ్ముడైన దాఖలాలు లేవని తెలిపారు పిపా చైర్మన్ నికోలస్ గైసెల్బ్రెచ్ట్. న్యూ కిమ్ పావురం వేలం గురించి నికోలస్ మాట్లాడుతూ.. నిజానికి ఆ పావురం ఇంత రేటు పలుకుతుందని అస్సలు అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. న్యూ కిమ్ 2018లో జరిగిన ఏస్ పీజియన్ గ్రాండ్ నేషనల్ మిడిల్ డిస్టెన్స్ పోటీల్లో విజేతగా నిలిచిందన్నారు. ఈ పావురం ఉత్తమ జాతికి చెందినది కావడంతో దాన్ని పోటీపడి అంత ధరకు సొంతం చేసుకున్నారన్నారు. న్యూ కిమ్ ప్రపంచంలోనే అత్యంత భారీ ధరకు పలికిన పావురంగా చరిత్ర సృష్టించిందన్నారు.