
‘‘అనగనగా ఒక పాడుబడ్డ భవనం. ఏరికోరి అక్కడకు వెళ్లే హీరో గ్యాంగ్. ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్న ఓ దెయ్యం. దానికో విషాదభరిత గతం. అదేంటో తెలుసుకుని, దానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేసి, తన వాళ్లను కాపాడుకునే హీరో’’. మన దగ్గర ఏ హారర్ సినిమా వచ్చినా దాదాపుగా ఇదే కథ.
అయితే నేపథ్యంతో పాటు కథనంలో వైవిద్యం, తెరపై కొత్తగా ప్రజెంట్ చేస్తూ భయపెట్టగలిగితే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ జానర్ ఇది. ఇలాంటి హారర్ జానర్‌లో ఈ శుక్రవారం (12.9.2025) ‘కిష్కింధపురి’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ రొటీన్‌కు భిన్నంగా భయపెట్టిందో, లేదో అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలీ (అనుపమ పరమేశ్వరన్) ఘోస్ట్‌లను చూపించే గైడ్స్. ఔత్సాహికులను పాడుబడ్డ భవనాల్లోకి తీసుకెళ్లి అక్కడి దెయ్యాల గురించి కథలుకథలుగా చెప్పి వాళ్లను భయపెట్టడమే వీళ్ల ప్రొఫెషన్. అలా ఓసారి సువర్ణమాయ అనే మూతపడిన రేడియో స్టేషన్‌కు వెళ్తారు. వాళ్లతో పాటు ఎనిమిది మంది ఔత్సాహికులు వస్తారు. కానీ ఈసారి అక్కడ నిజమైన దెయ్యం ఎదురుపడుతుంది.
రేడియోలోని వాయిస్‌తో వాళ్లను భయపెడుతుంది. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడతారు. కానీ ఆ దెయ్యం వార్నింగ్ ఇచ్చినట్టుగానే అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లలో ఒక్కక్కరూ చనిపోతుంటారు. ఇంతకూ రేడియో స్టేషన్‌లో ఉన్న దెయ్యం ఎవరు? తన గతం ఏమిటి? ఎందుకలా చంపుతోంది? దాని బారి నుంచి మిగతా వాళ్లను కాపాడటానికి రాఘవ్ ఏం చేశాడనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే:
ప్రారంభంలో చెప్పుకున్నట్టు ఇది కూడా పాడుబడ్డ భవనం. అందులో దెయ్యం అనే రొటీన్ స్టోరీనే. అయితే బ్యాక్‌డ్రాప్‌తో పాటు స్క్రీన్ పై కొత్తగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి. రేడియో దెయ్యం తనదైన వాయిస్‌తో వార్నింగ్ ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది. 1989 నేపథ్యంలో క్యూరియాసిటీగా సినిమా ప్రారంభించిన దర్శకుడు.. ఆ తర్వాత తిరిగి కథలోకి వెళ్లడానికి ఇరవై నిముషాల వరకూ సమయం తీసుకున్నాడు.
అయితే సువర్ణమాయ అనే రేడియో స్టేషన్లోకి వెళ్లాక ఒక్కో సీన్‌తో కథలో వేగం పెంచాడు. ముఖ్యంగా హీరోతో పాటు ఆ రేడియో స్టేషన్‌లోకి వెళ్లిన వారిలో ఒక్కొక్కరు చనిపోతుండటం, వాళ్ల బాడీస్ దగ్గర స్వస్తిక్ గుర్తు కనిపించడం లాంటి సీన్స్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగాడు. దీంతో ప్రారంభంలోని బోరింగ్ సీన్స్‌ను ప్రేక్షకులు మర్చిపోగలిగారు. ఆ తర్వాతి చావు ఎవరిది అనే క్రమంలో హీరో చిన్నారిని కాపాడటం, ఆ తర్వాత అసలు ఆ దెయ్యం ఎవరనే సీన్స్‌తో కథలో వేగం పెరగడంతో పాటు సెకండాఫ్‌లో ఏం జరగబోతోందనే ఆసక్తి రేకెత్తించగలిగారు.
అయితే సెకండాఫ్‌లో దెయ్యానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్, అందులోని మదర్ సెంటిమెంట్ సీన్స్‌తో కథలో వేగం తగ్గింది. ఘోస్ట్ పాత్రలో ట్విస్ట్ బాగున్నప్పటికీ ఆ పాత్ర ‘కాంచన’ సిరీస్‌ను గుర్తుచేసింది. ఆ తర్వాత వచ్చే అనుపమను దెయ్యం ఆవహించే సీన్ సెకండాఫ్‌కు మేజర్ హైలైట్‌గా నిలిచింది. రొటీన్ క్లైమాక్స్‌తో సినిమా ముగిసింది.
ఎవరెలా నటించారంటే?
రాఘవ పాత్రలో సినిమానంతా తన భుజాలపై నడిపించాడు బెల్లంకొండ శ్రీనివాస్. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. మైథిలి పాత్రలో అనుపమ ఆకట్టుకుంది. ముఖ్యంగా దెయ్యం ఆవహించిన సీన్స్‌లో భయపెట్టింది. లియో, కొత్త లోక చిత్రాల తర్వాత శాండీ మాస్టర్ మరోసారి ఈ సినిమాతో సర్‌ప్రైజ్ చేశాడు. ప్రేమ, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో మెప్పించారు. హైపర్ ఆది, సుదర్శన్ నవ్వించే ప్రయత్నం చేశారు.
సాంకేతికంగా..
చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో కొత్త తరహా బీజీఎంతో సర్‌ప్రైజ్ చేశాడు. భయపెట్టడంలో ఆర్.ఆర్ కీరోల్ ప్లే చేసింది. ఇక చిన్మయ్ సలస్కార్ కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌హారర్ సీన్స్‌లో తీసుకున్న కేర్... నిర్మాత సాహు గారపాటి పెట్టిన ఖర్చు స్క్రీన్ పై కనిపిస్తోంది. దర్శకుడు కౌశిక్ టెక్నికల్ టీమ్ నుంచి బెస్ట్ అవుట్ పుట్ తీసుకోవడంతో విజువల్‌గా సినిమా రిచ్‌గా వచ్చింది.
ఫైనల్‌గా..
ఒక హారర్ సినిమాకు రేడియో స్టేషన్ బ్యాక్‌డ్రాప్ వాడుకోవడం, రేడియోలోని వాయిస్‌తో భయపెట్టడం ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చాయి. అదే ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌కు మేజర్ ప్లస్ పాయింట్. ఇకసెకండాఫ్లో ఘోస్ట్ క్యారెక్టర్‌లోని ట్విస్ట్ సర్‌ప్రైజ్ చేసింది. కానీ రొటీన్ క్లైమాక్స్‌తో ముగిసింది. విజువల్స్, బీజీఎం, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. వీటన్నింటి మధ్య ఇంకా ఏదో ఉండాలి.. అనే చిన్నపాటి వెలితి హారర్ సినిమాల అభిమానులను హంట్ చేస్తుంది. ఇక సీక్వెల్ కోసం ఇచ్చిన లీడ్ ఆకట్టుకుంది.
మిస్టరీ, హారర్‌ను బ్లెండ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎటొచ్చి ప్రారంభం, ముగింపు రొటీన్‌కు ఉండటం మినహాయిస్తే.. ఒక హారర్ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే థ్రిల్‌ను, విజువల్ ఎక్స్ పీరియన్స్ను ఈ చిత్రంలో ఎంజాయ్ చేయొచ్చు.