- డిపాజిట్ సొమ్మును వడ్డీతో కలిపి రూ.40 కోట్లు చెల్లించిన సీసీఓ
హైదరాబాద్, వెలుగు: బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ–2 ఓపెన్‌కాస్ట్ గని మూసివేతపై కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అ భినందించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేతను పూర్తి చేసిన సింగరేణి సంస్థకు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్(సీసీఓ) రూ.40 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించింది.
గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి విడుదల చేసినట్లు సింగరేణి యాజమాన్యం బుధవారం వెల్లడించింది. సింగరేణి సంస్థ 2013–14లో డోర్లీ–2 ఓపెన్‌కాస్ట్ గనికి అనుమతులు పొంది, 2024లో గనిని మూసివేసింది. గని జీవితకాలంలో చేపట్టాల్సిన పర్యావరణ పరిరక్షణ, భూసంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాల కోసం రూ.26.79 కోట్లను ముందస్తుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీసీఓ పేరుతో డిపాజిట్ చేసింది.
ఈ గనిలో ఏడు సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఓపెన్‌కాస్ట్ గనుల ప్రారంభ సమయంలో మైన్ క్లోజర్ ప్లాన్‌లో పేర్కొన్న పర్యావరణహిత చర్యలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అంచనా వ్యయాన్ని డిపాజిట్ రూపంలో తీసుకుంటారు. గని మూసివేత అనంతరం నిబంధనలు అమలయ్యాయా లేదా అనే విషయాన్ని స్వతంత్ర సంస్థల ద్వారా పరిశీలిస్తారు.
పర్యావరణ నిబంధనలు పకడ్బందీగా అమలు..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్‌పూర్ నిపుణులు 2024 జూలైలో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి ఆడిట్ చేశారు. గని తవ్వకాల ప్రాంతంలో 162.517 హెక్టార్లలో దట్టమైన అటవీ పెంపకం, సుమారు 19.76 లక్షల క్యూబిక్ మీటర్ల టాప్ సాయిల్‌ను భద్రపరచి తిరిగి వినియోగించడం, 10 కిలోమీటర్ల పొడవునా గార్ల్యాండ్ డ్రైనేజీలు, రెండు చెక్‌డ్యామ్‌లు నిర్మించడం, గని నిర్మాణాలను సురక్షితంగా తొలగించడం వంటి చర్యలను సింగరేణి పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు.
దీంతో ఏడేళ్ల క్రితం డిపాజిట్ చేసిన మొత్తాన్ని వడ్డీతో కలిపి రూ.40 కోట్లుగా సింగరేణికి తిరిగి చెల్లిస్తున్నట్లు డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాష్ శివ హరే లేఖ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం సంతృప్తి వ్యక్తం చేసింది. డోర్లీ–1 గనికి సంబంధించి కూడా తనిఖీలు చివరి దశలో ఉన్నాయని, ఆ గనికి సంబంధించిన మరో రూ.60 కోట్లకు పైగా డిపాజిట్ మొత్తం కూడా తిరిగి వచ్చే అవకాశం ఉందని సింగరేణి ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.
