సీపీఎం లీడర్లు, అంగన్‌‌వాడీలను తిట్టిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

సీపీఎం లీడర్లు, అంగన్‌‌వాడీలను తిట్టిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
  • సీపీఎం జిల్లా కార్యదర్శి కాలర్ పట్టుకున్న మున్సిపల్ కౌన్సిలర్
  • క్షమాపణలు చెప్పాలని అంగన్‌‌వాడీల డిమాండ్
  • ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదుట ధర్నా

బెల్లంపల్లి, వెలుగు : అంగన్​వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా ఆయన నోరు పారేసుకున్నారు. తెలంగాణ అంగన్‌‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, జిల్లా కార్యదర్శి కోట రాజమణి , అంగన్‌‌వాడీలు కలిసి ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వెళ్లి దుర్గం చిన్నయ్యకు వినతిపత్రం ఇచ్చారు. అదే సమయంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవితో పాటు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గొమాస ప్రకాశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, జిల్లా కార్యదర్శి దూలం శ్రీనివాస్, మహిళ నేతలు రాజేశ్వరి, బోగె అనురాధ, దాసరి రాజేశ్వరి అక్కడికి వెళ్లారు. వారిని చూసిన ఎమ్మెల్యే ‘ఎందుకొచ్చారు? వెళ్లిపోండి’ అని కసురుకున్నారు. ‘ మూడు ముక్కల ఎర్ర జెండాల వారితో ఏమవుతుంది’ అని దుర్భాషలాడారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ పదో వార్డు కౌన్సిలర్ కొక్కెర చంద్రశేఖర్ సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి కాలర్ పట్టి లాగారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, అంగన్​వాడీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిణామంతో అంగన్​వాడీలతో పాటు సీపీఎం లీడర్లు అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. దుర్గం చిన్నయ్య, కౌన్సిలర్ కొక్కెర చంద్రశేఖర్ క్షమాపణలు  చెప్పాలని నినదించారు. అక్కడే ఉన్న వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య, ఎస్సై ప్రవీణ్ కుమార్, ఏఎస్సై తిరుపతి, కానిస్టేబుల్స్.. ఆందోళనకారులను సముదాయించారు.

నేటి నుంచి ఆందోళనలు

ఎమ్మెల్యే తీరుకు నిరసనగా సోమవారం నుంచి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి ప్రకటించారు. బెల్లంపల్లిలో అంగన్​వాడీలు చేపట్టిన దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతూ ఎమ్మెల్యే చిన్నయ్యపై  సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. తన కాలర్ పట్టి దాడికి ప్రయత్నించిన మున్సిపల్ కౌన్సిలర్ కొక్కెర చంద్రశేఖర్​పై పోలీసులు కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.