పసిమొగ్గలు రాలిపోతున్నరు

పసిమొగ్గలు రాలిపోతున్నరు

    నిరుడు 8.82 లక్షల  చిన్నారులు చనిపోయిన్రు

    ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లో ఇండియానే టాప్

     యునిసెఫ్​‘ప్రపంచ పిల్లల స్థితి నివేదిక–2018’ విడుదల 

నేటి పిల్లలే రేపటి పౌరులు. కానీ.. మన దేశంలో ఏటా లక్షలాది మంది పిల్లలు రేపటి పౌరులుగా ఎదిగేలోపే కన్నుమూస్తున్నారు. ఐదేళ్లు నిండకుండానే పసి మొగ్గలు రాలిపోతున్నారు. దేశవ్యాప్తంగా గత ఏడాది ఏకంగా8.82 లక్షల మంది పిల్లలు చనిపోయారట. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో ఇండియా ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉందని బుధవారం యునెస్కో విడుదల చేసిన ‘ప్రపంచ పిల్లల స్థితి నివేదిక–2018’ వెల్లడించింది.

నివేదికలోని హైలైట్స్ ఇవే..

2018లో ఇండియా తర్వాత నైజీరియాలో అత్యధికంగా 8.66 లక్షల మంది, పాకిస్తాన్ లో 4.09 లక్షల మంది పిల్లలు చనిపోయారు.

ప్రతి వెయ్యి జననాలకు ఐదేళ్లలోపు మరణాల సంఖ్యలో మాత్రం ఇండియా పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ఇండియాలో ఈ సంఖ్య 37 మాత్రమే కాగా, నైజీరియాలో 120, పాకిస్తాన్‌‌‌‌లో 69గా నమోదైంది.

చైనాలో 1.46 లక్షలు, బంగ్లాదేశ్‌‌‌‌లో 89 వేలు, అఫ్ఘానిస్థాన్‌‌‌‌లో 74 వేలు, నేపాల్‌‌‌‌లో 18 వేలు, శ్రీలంకలో 3 వేల మంది పిల్లలు మరణించారు.

2018లో సింగపూర్, డెన్మార్క్, బహ్రెయిన్, న్యూజిలాండ్, స్వీడన్‌‌‌‌ సహా 65కు పైగా దేశాల్లో వెయ్యిలోపు మరణాలే నమోదయ్యాయి.

మనదేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో 38% మంది పేదరికం, సరైన ఆహారం అందకపోవడం వల్ల వయసుకు తగ్గ ఎత్తు ఎదగడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

దేశంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం, ఫాస్ట్ ఫుడ్, కూల్‌‌‌‌డ్రింకుల తయారీదారులకు అవకాశాలు ఎక్కువయ్యాయని, దీంతో 2011 నుంచి 2016 మధ్యలో ఫాస్ట్ ఫుడ్ సేల్స్ 113% పెరిగాయి.

తల్లిపాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో  బ్రెస్ట్ ఫీడింగ్ 24.5% (2006) నుంచి 44.6% (2014)కు పెరిగింది.

దేశంలో రక్తహీనత నివారణ కోసం ప్రతి వారం ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ల పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో ప్రారంభించిన నేషనల్ ప్రోగ్రాం కూడా మంచి ఫలితాలనిస్తోందని యునిసెఫ్‌‌‌‌ పేర్కొంది.

ఇండియా హెల్త్ ప్రోగ్రాంలు భేష్

కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల హెల్త్ ప్రోగ్రాంలు బాగున్నాయని యునిసెఫ్‌‌‌‌ ప్రశంసించింది. ఈ నెల మొదట్లో ఆరోగ్య శాఖ  విడుదల చేసిన కాంప్రహెన్సివ్ నేషనల్ న్యూట్రిషన్ సర్వే ప్రకారం దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో 35 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు పెరగలేదు. 17 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేరు. 33 శాతం మంది సాధారణం కంటే తక్కువ బరువుతో ఉన్నారని తేలింది. 2016–18 మధ్యలో జరిగిన ఈ సర్వేను యునిసెఫ్ కూడా విశ్లేషించింది. విటమిన్ ఏ లోపం నివారణ, ఇతర పోషకాహార లోపాల నివారణకు ఈ సర్వే సమాచారం ఉపయోగపడుతుందని తెలిపింది. హెల్త్, ఎడ్యుకేషన్ పాలసీలు పిల్లల అభివృద్ధికి ఎలా తోడ్పడతాయన్నదానికి ఇండియా ఒక ఉదాహరణగా నిలిచిందని యునిసెఫ్ అభిప్రాయపడింది.