IND vs ENG 3rd Test: భారత బౌలర్ల జోరు.. ఒంటరి పోరాటం చేస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్

IND vs ENG 3rd Test: భారత బౌలర్ల జోరు.. ఒంటరి పోరాటం చేస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్

రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తడబడి కోలుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బుమ్రా ధాటికి స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినా..  స్టోక్స్ ఒంటరి పోరాటం ఇంగ్లాండ్ ను నిలబెట్టింది. దీంతో మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ స్టోక్స్ (39), బెన్ ఫోక్స్ (6) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 155 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో 5 వికెట్లు ఉన్న నేపథ్యంలో సెకండ్ సెషన్ లో ఇంగ్లీష్ జట్టు ఎలా ఆడుతుందో ఆసక్తికరంగా మారింది.

 2 వికెట్ల నష్టానికి 207 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్  ప్రారంభించగా.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత్ కు శుభారంభం ఇచ్చాడు. కీలకమైన రూట్ వికెట్ ను తీసి ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ధాటికి బెయిర్ స్టో ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌట్ అయ్యాడు. ఇక ఇదే ఊపులో ఈ చైనా మన్ స్పిన్నర్ సెంచరీ హీరో డకెట్ (153) ను పెవిలియన్ కు పంపి ఇంగ్లాండ్ ను కష్టాల్లోకి నెట్టాడు. ఒక దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్నా.. కెప్టెన్ స్టోక్స్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 

అజేయంగా 39 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను ఆదుకునే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ తో ఆరో వికెట్ కు అజేయంగా 30 పరుగులు చేసి మరో వికెట్ పడకుండా సెషన్ ను ముగించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకోగా.. సిరాజ్, బుమ్రా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. అశ్విన్ వ్యక్తిగత కారణాలతో ఈ టెస్ట్ నుంచి తప్పుకోవడంతో భారత్ 10 మంది ప్లేయర్లతోనే ఈ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.