
- బ్రిటిష్ గడ్డకు తొలి వరల్డ్‌కప్‌ను అందించిన గ్రేట్ ఆల్‌రౌండర్
- 44 ఏండ్ల నిరీక్షణకు తెరదించిన యువ కెరటం
‘జీవితం ఎవడ్ని వదలదు.. అందరి సరదా తీర్చేస్తుంది’.. కాలం కూడా అంతే..! అగాధంలో కూరుకుపోయినోడిని ఆకాశానికి ఎత్తుతుంది.. ఆకాశంలో ఉన్నొడిని నేల మీదకూ దించుతుంది..! దీనికి క్రికెటర్లూ అతీతులు కారు..! ఒక్క మ్యాచ్‌తో జీరోలవుతారు.. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్‌నైట్ హీరోలూ అవుతారు..! కాలం పెట్టే విషమ పరీక్షకు ఎదురొడ్డి నిలిచినోడే.. చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకుంటాడు..! ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇదే కోవలోకి వస్తాడు..! ఊహలకందని ఎత్తుపల్లాల కెరీర్‌లో ఎన్ని అవమానాలు ఎదురైనా.. విమర్శలు వెల్లువెత్తినా.. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని ఒక్కో సవాల్‌ను అధిగమిస్తూ.. ఇంగ్లిష్ జట్టుకు తొలి వరల్డ్‌కప్ అందించి హీరోగా మారిపోయాడు..! ఒకప్పుడు జీరో అంటూ హేళన చేసిన నోళ్లతోనే ఇప్పుడు జేజేలు కొట్టించుకుంటూ బ్రిటిష్ గడ్డకు ‘సూపర్ హ్యూమన్’ అయ్యాడు..!
బెన్ స్టోక్స్.. కెరీర్ ఆరంభంలో ఈ పేరు చెబితే అత్యుత్తమ నైపుణ్యం ఉన్న ప్రతిభావంతుడు అన్నారు. కొన్నేళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్‌ను ఏలుతాడని పండితులు జోస్యం కూడా చెప్పారు. అన్నట్లుగానే ప్రారంభంలో అతను ఆడిన ఆట, చూపిన తెగువ చూసి ప్రపంచ క్రికెట్‌కు సరికొత్త ఆల్‌రౌండర్ లభించాడని మురిసిపోయారు. కానీ అన్ని మనం అనుకున్నట్టుగా సాగితే అది ‘కాలం’ ఎందుకవుతుంది. ఆటలో జీవితాన్ని పరుగులుపెట్టించాల్సిన స్టోక్స్.. బయటి వ్యవహారాలపై దృష్టిపెట్టడంతో క్రమంగా జీరోగా మారిపోయాడు. ఎంతలా అంటే ఓ దశలో కెరీర్‌కు గుడ్‌బై చెబుదామనే వరకు..! ఇక్కడ సీన్ కట్ చేస్తే.. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఇప్పుడు ఇంగ్లండ్‌కు హీరోగా మారిపోయాడు..! అసలు ఈ మధ్యలో ఏం జరిగిందో చూద్దాం..!
జీరో అయ్యాడు
2011లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టోక్స్ కెరీర్ అనుకున్నంత సాఫీగా సాగలేదు. ప్రతిభ, నైపుణ్యం ఉన్నా.. ఆటపై అతని ఆలోచన విధానం క్రికెట్‌లో వెనకబడేలా చేసింది. అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేక జట్టులో చోటునే ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఇతర ఆటగాళ్ల గాయాలు, సమీకరణాల నేపథ్యంలో కొన్ని రోజులు అలా గడిచిపోయినా.. 2016 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ అతన్ని నిండా అగాధంలోకి పడేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గెలుపు దిశలో ఉన్న ఇంగ్లండ్‌ను తన బౌలింగ్‌తో ఓటమి కోరల్లోకి నెట్టేశాడు. చివరి ఓవర్‌లో 19 రన్స్ కావాల్సిన దశలో బౌలింగ్‌కు వచ్చిన స్టోక్స్.. బ్రాత్‌వైట్‌కు వరుసగా నాలుగు సిక్సర్లు సమర్పించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను చేజిక్కించుకున్న బ్రాత్‌వైట్ కరీబియన్లకు రెండోసారి పొట్టి వరల్డ్‌కప్‌ను అందించాడు.
ఈ ఓటమి తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన స్టోక్స్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. మందుకు బానిసగా మారిపోయాడు. ఆటపై ఆసక్తిని వదిలేసుకున్నాడు. తాను ఇలా మారిపోతే సెలెక్టర్లు మాత్రం మరోలా భావించారు. అతని అవసరం ఇంగ్లండ్ జట్టుకు ఉందని గుర్తించి మళ్లీ అవకాశాలు ఇచ్చారు. కానీ క్రమశిక్షణరాహిత్యంతో మళ్లీ ఇబ్బందుల్లో పడ్డాడు. 2017లో.. బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో తప్పతాగి అర్ధరాత్రి రోడ్డు మీద గొడవపడ్డాడు. వివాదం పెద్దది కావడంతో వైస్ కెప్టెన్సీతో పాటు యాషెస్ సిరీస్ ఆడే జట్టులో నుంచి తప్పించారు. ఆ తర్వాత కేసులు, కోర్టుకు వెళ్లడం వంటి పరిణామాలతో టీమ్‌లో చోటు ప్రశ్నార్థకం చేసుకున్నాడు. నిషేధం కూడా ఎదుర్కోనే అవకాశాలు ఉండటంతో అతన్ని టీమ్ నుంచి శాశ్వాతంగా తప్పించాలనే డిమాండ్లు కూడా పెరిగాయి. కానీ ఏదో అదృష్టం వెంటాడినట్లు.. 2018లో ఈ వివాదం నుంచి స్టోక్స్‌కు కోర్టు ఉపశమనం కలిగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని సెలెక్టర్లు అతనిపై మళ్లీ నమ్మకం పెట్టారు. ఆరంభంలో ఎలా మద్దతిచ్చారో.. కష్టకాలంలో కూడా వెన్నంటే ఉండి వరల్డ్‌కప్ టీమ్‌లో స్థానం కల్పించారు.
హీరోగా మారాడు..
వరల్డ్‌కప్ జట్టులో చోటు అయితే దక్కించుకున్నాడు కానీ ఎలా ఆడతాడనే దానిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. మోర్గాన్, బట్లర్, రూట్‌కు సహకారం అందిస్తే చాలు అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని స్థాయిలో అతను మెగా టోర్నీలో మెరుపులు మెరిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 79 బంతుల్లో 89 రన్స్ చేసి టీమ్‌ను గెలిపించాడు. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ బ్యాట్, లేకపోతే బంతితో ఏదో రకంగా జట్టుకు ఉపయోగపడటంతో సెలెక్టర్ల నమ్మకం పెరిగింది. ఇక టీమిండియాతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 79 రన్స్ చేసి ఇంగ్లండ్‌ను నాకౌట్‌కు చేర్చి ఒక్కసారిగా ‘సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్’ అయ్యాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఆకట్టుకోకపోయినా.. ఫైనల్ రూపంలో వచ్చిన గొప్ప అవకాశాన్ని రెండు చేతుల్లా ఒడిసిపట్టుకున్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన హోరాహోరీ మహా సంగ్రామంలో సహచరులందరూ విఫలమైన స్థితిలో, ఇంగ్లండ్‌కు ఓటమి తప్పదనే పరిస్థితిలో ఒంటరిగా పోరాడి 98 బంతుల్లో 84 రన్స్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లి కప్ ఆశలను సజీవంగా ఉంచాడు. ఇంతటితో ఆగిపోతే అతను స్టోక్స్ ఎందుకవుతాడు. కాలం ఎక్కడైతే పరీక్ష పెడుతుందో అక్కడ మళ్లీ అతను పోరాటానికి సిద్ధమవుతాడు. అందుకే సూపర్ ఓవర్‌లోనూ తానే బ్యాటింగ్‌కు దిగాడు. మంచినీళ్ల ప్రాయంలా సిక్సర్లు కొట్టే బెయిర్‌స్టో, బట్లర్, మోర్గాన్‌ను కాదని తాను బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్‌లో ఎనిమిది పరుగులు చేసి 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లండ్‌కు తొలిసారి కలల కప్‌ను అందించాడు. గత11 ఎడిషన్లుగా చేసిన పోరాటంలో ఏ ఒక్క ఇంగ్లండ్ ప్లేయర్ కప్‌ను గెలిపించే సాహసం చేయలేదు. కానీ వచ్చిన ఒకే ఒక్క అవకాశంతో బ్రిటిష్ గడ్డకు ‘వరల్డ్‌కప్’ను అందిస్తూ ‘సూపర్ హ్యూమన్’గా మారిపోయాడు. టోర్నీలో మొత్తం 465 రన్స్, 7 వికెట్లు తీసిన ఈ గ్రేట్ ఆల్‌రౌండర్.. ఐసీసీ వరల్డ్‌కప్ ఎలెవన్‌లోనూ చోటు సంపాదించాడు. ఓవరాల్‌గాఈడెన్ గార్డెన్స్‌లో జీరోగా మారిన స్టోక్స్.. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో సూపర్ హీరో అయ్యాడు.