
బిజినెస్ డెస్క్, వెలుగు: యూఎస్‌లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ), సిగ్నేచర్ బ్యాంకులు దివాలా తీయడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం సెషన్‌లో పతనమయ్యాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయిన సెన్సెక్స్, చివరికి 897 పాయింట్ల (1.52%) లాస్‌తో 58,238 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 259 పాయింట్లు నష్టపోయి 17,154 వద్ద ముగిసింది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 2,100 పాయింట్లు పతనమవ్వగా, ఇన్వెస్టర్ల సంపద రూ.7.3 లక్షల కోట్లు తగ్గింది. ఇన్వెస్టర్ల భయాన్ని కొలిచే నిఫ్టీ విక్స్ ఇండెక్స్ 20 శాతం పెరిగింది. దేశంలో బ్యాంక్‌లు స్ట్రాంగ్‌గా ఉన్నాయని రెగ్యులేటరీలు, ఎనలిస్టులు చెబుతున్నప్పటికీ, సోమవారం సెషన్‌లో బ్యాంక్ షేర్లు భారీగా పడ్డాయి. లాకిన్ పీరియడ్ పూర్తవ్వడంతో యెస్ బ్యాంక్ షేర్లు 7 శాతం మేర పడ్డాయి. మేనేజ్‌మెంట్ సమస్యలతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు కూడా 7 శాతం నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 921 పాయింట్లు (2.27 శాతం) పతనమై 39,565 వద్ద క్లోజయ్యింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు సోమవారం నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్ పడడానికి కారణాలు..
1) ఎస్‌వీబీ, సిగ్నేచర్ బ్యాంక్‌లు దివాలా తీయడం మార్కెట్ మూడ్ మార్చేసింది. ఫైనాన్షియల్‌గా అన్ని దేశాలతో లింక్ అయి ఉండడంతో, ఏ మూల ఏ ఫైనాన్షియల్ సంక్షోభం వచ్చినా మనపై ప్రభావం ఉంటుందని ఎనలిస్టులు పేర్కొన్నారు.
2) యూఎస్ బ్యాంకింగ్ క్రైసిస్‌తో గ్లోబల్ షేర్లు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్‌లపై పడింది. టోక్యో, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్‌లు రెండున్నర శాతం వరకు పడ్డాయి. హాంకాంగ్, షాంఘై, సియోల్ మార్కెట్‌లు మాత్రం పాజిటివ్‌గా ముగిశాయి.
3) ఎస్‌వీబీ సంక్షోభం వలన వడ్డీ రేట్లను ఫెడ్ 50 బేసిస్ పాయింట్లు పెంచకపోవచ్చు. కానీ, ఈ రేట్ల పెంపు ఎంత ఉంటుందనేది యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటాపై ఆధారపడుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అంచనాల కంటే ఎక్కువ ఉంటే వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల చివరిలో జరిగే ఫెడ్ మీటింగ్‌లో వడ్డీ రేట్లను పెంచరని గోల్డ్‌మాన్ శాచ్స్
అంచనావేస్తోంది.
ఇన్‌ఫ్లేషన్ కొద్దిగా తగ్గినా..
దేశంలో ఇన్‌ఫ్లేషన్ ఫిబ్రవరిలో కొద్దిగా తగ్గి 6.44 శాతంగా రికార్డయ్యింది. అయినప్పటికీ ఆర్‌బీఐ పెట్టుకున్న అప్పర్ లిమిట్ 6 శాతం పైన వరుసగా రెండో నెలలో కూడా నమోదుకావడాన్ని గమనించాలి. ఈ ఏడాది జనవరిలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ను కొలిచే సీపీఐ 6.52 శాతంగా నమోదవ్వగా, ఫిబ్రవరిలో ఈ నెంబర్ 6.44 కి తగ్గింది. కిందటేడాది డిసెంబర్, నవంబర్‌లలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 6 శాతం లోపు రికార్డయిన విషయం తెలిసిందే. వచ్చే నెల 3 న ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్ మొదలుకానుండగా, ఈ సారి పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతారని అంచనాలు ఎక్కువయ్యాయి.
రూ. 99 కే బ్యాంక్ కొన్నరు..
ఇంగ్లండ్‌లో సేవలందిస్తున్న ఎస్‌వీబీ సబ్సిడరీ ఎస్‌వీబీ యూకేను హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్ పీఎల్‌సీ ఒక పౌండ్ (రూ.99) కే కొనుగోలు చేసింది. ఎస్‌వీబీ యూకే 5.5 బిలియన్ పౌండ్ల అప్పులిచ్చింది. 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లు కలిగి ఉంది. ఈ కంపెనీ ఈక్విటీ వాల్యుయేషన్ 1.4 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఈ ట్రాన్సాక్షన్‌లో పేరెంట్ కంపెనీ ఎస్‌వీబీ ఆస్తులను, అప్పులను కలపలేదు. ఈ డీల్‌కు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తామని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. అలానే ఈ డీల్ పూర్తయ్యాక కొత్త షేరు హోల్డింగ్ ప్యాటర్న్‌ను ప్రకటిస్తామని వివరించింది.
ఈసారి సిగ్నేచర్ బ్యాంక్ వంతు..
ఎస్‌వీబీ బాటలోనే సిగ్నేచర్ బ్యాంక్ కూడా దివాలా తీసింది. ఈ బ్యాంక్‌ను న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మూసివేసింది. సిగ్నేచర్ బ్యాంక్ కస్టమర్లు, డిపాజిటర్లను కాపాడేందుకు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) సిగ్నేచర్ బ్యాంక్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. సిగ్నేచర్ బ్రిడ్జ్ బ్యాంక్, ఎన్‌ఏ పేరుతో కొత్త బ్యాంక్‌ను లాంచ్ చేసింది. సిగ్నేచర్ బ్యాంక్ కస్టమర్లు, బారోవర్లు, డిపాజిటర్లకు ఈ బ్యాంక్ సర్వీస్‌లు అందిస్తుంది. ఏటీఎం సర్వీస్‌లను కూడా అందిస్తుంది. సిగ్నేచర్ బ్యాంక్‌ను కొనేందుకు బిడ్డర్లు దొరికేంత వరకు సిగ్నేచర్ బ్రిడ్జ్ బ్యాంక్ కొనసాగుతుంది.