‘కంటి వెలుగు’ ఎక్కడ ?

‘కంటి వెలుగు’ ఎక్కడ ?

రంగారెడ్డి జిల్లా, వెలుగు: జిల్లాలో వేలాది మంది కంటి ఆపరేషన్‌, పాయింటెడ్‌ అద్దాల కోసం ఎదురుచూస్తున్నారు. నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని  ప్రభుత్వం ప్రారంభించింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని  లక్షలాది మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో  ‘కంటి వెలుగు’  కార్యక్రమం ముగిసి ఆరు నెలలు గడుస్తోంది. కంటి అద్దాలు అందకపోవడం, ఆపరేషన్లు చేయకపోవడంతో అనేక మంది వాటి కోసం ఎదురుచూస్తున్నారు.   2018 ఆగస్టు 15న కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా వైద, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి నిపుణులైన కంటి వైద్యులు, మండలాల వైద్య సిబ్బంది కలసి 2019 ఫిబ్రవరి వరకు కంటిపరీక్షలు నిర్వహించారు. నిరాటంకంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో అవసరమైన వారిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. చాలామందికి అక్కడికక్కడే కంటి అద్దాలను కూడా అందజేశారు. తొలుత కార్యక్రమం బాగానే జరిగినా ఆ తర్వాత పరిస్థితి మారింది. నెలలు గడిచినా కంటి అద్దాలు అందటం లేదు. ఆపరేషన్ల ఊసే లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

8,60,898 మందికి పరీక్షలు…

జిల్లావ్యాప్తంగా 15 లక్షల  జనాభా ఉంది. అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ అన్ని గ్రామాలో పర్యటించిన వైద్య సిబ్బంది కార్యక్రమం పూర్తయ్యే నాటికి 8,60,898 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో వృద్ధులు, యువత, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. చిన్నపాటి సమస్య ఉన్నవారికి దగ్గర చూపునకు అవసరమైన కంటి అద్దాలు(రీడింగ్‌) 1,76,965  మందికి అప్పటికప్పుడు అందజేశారు. మరో  1,27,266 మందికి దూరపు చూపు అద్దాలు(ప్రిస్క్రిప్షన్‌ గ్లాసెస్‌) అవసరమని గుర్తించగా 87,063 మందికి అందించారు. ఇంకా 40,203 మందికి అద్దాలు అందాల్సి ఉంది. ఆరు నెలలు గడిచినా అందకపోవటంతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తుందని ఆశపడ్డామని, చేసేది లేక ప్రైవేటు హాస్పిటల్స్​కు వెళ్లి అద్దాలు తెచ్చుకుంటున్నామని వాపోతున్నారు. జిల్లాలో తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతూ ఆపరేషన్లు అవసరమైన వారు 60,917 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ప్రభుత్వం ఆపరేషన్లు చేయిస్తే ఆర్థిక భారం లేకుండా తమ సమస్య పోతుందని అంతా అనుకున్నారు. కానీ కేవలం 5వేల మందికి మాత్రమే ఆపరేషన్లు చేసి మిగతావారిని వదిలేయటంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

నిధుల లేమితోనే జాప్యం…

జిల్లాలో ఆపరేషన్ల కోసం 60,917 మందిని గుర్తించారు. వీరిలో 42,867 మందికి చిన్న ఆపరేషన్లు, 18,058 మందికి పెద్ద ఆపరేషన్లు చేయాల్సి ఉంది. అయితే చిన్న ఆపరేషన్లకు సంబంధించిన 5వేల మందికి ఆపరేషన్లు చేయించారు. ఇంకా చిన్న, పెద్ద ఆపరేషన్లకు సంబంధించి 55,917 మందికి ఆపరేషన్లు చేయాల్సి ఉంది. వీరందరికి ఆపరేషన్లు చేయడానికి అధిక మొత్తం ఖర్చు అవుతుందని ప్రభుత్వ భావిస్తోంది. ఇందుకోసం తగిన బడ్జెట్‌ లేకపోవడంతోనే ఆపరేషన్ల చేయడంలో జాప్యం జరుగుతుందని  సంబంధిత అధికారులు చెబుతున్నారు.

కంటి వెలుగు వివరాలు …

జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహించింది –  8,60,898

రీడింగ్‌ అద్దాలు పంపిణీ   చేయాల్సింది-  1,76,965 మందికి

పాయింటెడ్‌ కళ్ల అద్దాలుఇవ్వల్సింది 1,27,266 మందికి

పంపిణీ చేసింది – 87,063

పంపిణీ చేయాల్సింది – 40,203

ఆపరేషన్లకు గుర్తించింది  –  60,917

చిన్న ఆపరేషన్లకు  – 42,867

పెద్ద ఆపరేషన్ల – 40,203 మందికి

మొత్తంగా చేసిన ఆపరేషన్లు 5వేల మందికి

ఇంకా చేయాల్సింది  –  55,917 మందికి

కంటి పరీక్షలు చేసిన వివరాలు…

మొత్తం గ్రామాలు – 462

పరీక్షలు జరిగినవి – 8,60,898 మందికి

పురుషులు – 3,80,180 మంది

స్త్రీలు – 4,80,684 మంది

ఇతరులు – 34

ఎస్సీలు – 1,54,005 మంది

ఎస్టీలు  – 72,235 మంది

బీసీలు – 4,67,020 మంది

ఓసీలు – 1,00,357 మంది

మైనార్టీలు – 37,281 మంది

ఇంకా ఆపరేషన్‌ చేయలే

-కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్నా.    కంటిలో పోరలున్నాయని డాక్టర్లు చెప్పారు.  ఆపరేషన్​ చేస్తే చూపు మంచిగా వస్తుందని చెప్పారు. అదికూడా పైస ఖర్చులేకుండా ప్రభుత్వమే చేపిస్తుందన్నారు. త్వరలోనే పట్నం( హైదరాబాద్‌)కు తీసుకపోతామన్నరు.   ఇప్పటికి ఆరునెలలు అవుతుంది. ఆపరేషన్‌ చేస్తరని ఎదురుచూస్తున్నా. –అంజమ్మ, కప్పపహాడ్​ గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం

ఉన్నతాధికారులకు చెప్పాం

-కంటివెలుగు   కింద జిల్లాలో లక్షలాది మందికి నేత్ర పరీక్షలు నిర్వహించాం. అవసరమైన వారికి అప్పటికప్పుడే అద్దాలను అందించాం. కంటి సమస్య తీవ్రంగా ఉన్నవారు, ఒక కన్ను సమస్య ఏర్పడిన వారిని గుర్తించి కావాల్సిన అద్దాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదలను పంపించాం. అక్కడి నుంచే అద్దాలు రాలేదు. ఆపరేషన్ల విషయంలో ప్రభుత్వం నుంచే ఆదేశాలు రావాల్సి ఉంది. –స్వరాజ్య లక్ష్మి, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి.