గొర్రెల పంపిణీ లేట్‌‌.. లబ్ధిదారులపై రూ. 12,500 భారం

గొర్రెల పంపిణీ లేట్‌‌.. లబ్ధిదారులపై రూ. 12,500 భారం
  • గొర్రెల పంపిణీలో లబ్ధిదారుల వాటా పెంచిన సర్కారు
  • సర్కారు నాన్చుడుతో 3.85 లక్షల మందిపై రూ. 500 కోట్ల అదనపు భారం
  • గతంలో డీడీలు తీసిన 14 వేల మందికీ ఎఫెక్ట్

హైదరాబాద్‌‌, వెలుగు: రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న గొల్లకురుమలకు సర్కారు షాక్‌‌ ఇచ్చింది. గొర్ల పంపిణీకి గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇస్తూనే లబ్ధిదారుల వాటాను పెంచింది. ఒక్కో లబ్ధిదారు గతంలో చెల్లించిన వాటాకు అదనంగా మరో రూ. 12,500 చెల్లించాలంటూ అదనపు భారం మోపింది. సర్కారు నాలుగేళ్ల నిర్లక్ష్యానికి 3.85 లక్షల మందిపై ఎఫెక్ట్‌‌ పడింది. గతంలో డీడీలు కట్టిన 14 వేల మందిపైనా భారం పడనుంది. మొత్తంగా లబ్ధిదారులందరూ కలిసి రూ. 500 కోట్ల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. 

2017లో స్టార్ట్‌‌
గొర్రెల పంపిణీ కోసం 2017లో 7,61,898 మంది లబ్ధిదారులను సర్కారు అర్హులుగా గుర్తించింది. లబ్ధిదారు వాటా రూ.31,250గా నిర్ణయించింది. ఈ నాలుగేళ్లలో 3,76, 223 మందికే గొర్రెలు పంపిణీ చేసింది. ఇంకో 3,85, 675 మందికి ఇవ్వాల్సి ఉంది. తాజాగా రెండో విడత పంపిణీకి గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చిన ప్రభుత్వం.. లబ్ధిదారుల వాటా రూ.43,750గా నిర్ణయించింది. ప్రతి లబ్ధిదారుపై అదనంగా రూ. 12,500 భారం మోపింది. ఇప్పటికే డీడీలు కట్టిన 14 వేల మంది కూడా పెంచిన వాటా కట్టాలని చెప్పింది. దీంతో అందరిపై కలిపి దాదాపు రూ. 500 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది. పెళ్లాం పుస్తెలు కుదవపెట్టి, అప్పులు తెచ్చి డీడీలు తీశామని.. నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న తమకు గొర్రెలు ఇవ్వకుండా మళ్లీ పైసలు కట్టమనడం ఏంటని గొల్లకురుమలు భగ్గుమంటున్నారు. 

యూనిట్‌‌ విలువ ఇట్ల..
గొర్రెల పథకంలో ఒక గొర్రె పొట్టేలు, 20 గొర్రెలు ఉంటాయి. గొర్రెకు రూ. 7,400 చొప్పున 20 గొర్రెలకు రూ.1,48,000.. గొర్రె పొట్టేలుకు రూ.10 వేలు అవుతుంది. మొత్తంగా ఒక యూనిట్‌‌కు రూ.1,58,000 ఖర్చవుతుంది. గొర్రెల రవాణాకు రూ. 6,500, దాణాకు రూ. 3,500, ఇన్సూరెన్స్‌‌కు రూ. 5 వేలు, మందులకు రూ.500, ఇతర ఖర్చులకు రూ.1,500 ఇలా మొత్తం రూ.1,75,000గా నిర్ణయించారు. ఇందులో లబ్ధిదారుల వాటా రూ.43,750.. ప్రభుత్వ  సబ్సిడీ  రూ.1,31, 250. గతంలో గొర్రెల యూనిట్‌‌ ధర రూ. 1.25 లక్షలు. దీన్ని ప్రభుత్వం రూ. 1.75 లక్షలకు పెంచింది. 

ఎలక్షన్లు వచ్చినప్పడల్లా..
సర్కారుకు గొల్లకురుమల కన్నా వారి ఓట్లమీదే ప్రేమ ఉంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా అమలు కాకుండా నిలిపేసిన పంపిణీని హుజూరాబాద్‌‌ ఉప ఎన్నిక ఉండటంతో తాజాగా సీఎం కేసీఆర్‌‌ తెరపైకి తెచ్చారని పలువురు అంటున్నారు. గతంలో హుజూర్‌‌నగర్‌‌, నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ టైమ్‌‌లోనూ పంపిణీపై ప్రకటన చేసి ఆయా నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా కొందరికి గొర్రెలు పంపిణీ చేశారు. ఎలక్షన్లు ముగియగానే ఆపేశారు. ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల దృష్ట్యా మళ్లీ కొత్తగా పంపిణీ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 

గొల్ల కురుమలపై భారం మోపొద్దు
గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన ప్పుడే రెండేళ్లలో పూర్తి చేస్తామని సర్కారు ప్రకటించింది. కానీ సగమే ఇచ్చి లేట్‌‌ చేసింది. ఇప్పుడు లబ్ధిదారుల వాటా రూ.12,500 పెంచింది. ఇన్నాళ్లూ ఓపిక పట్టినందుకు భారం మొపొద్దు.  
- ఉడుత రవీందర్‌‌, జీఎంపీఎస్‌‌ ప్రధానకార్యదర్శి