పేదల వ్యతిరేక ప్రభుత్వమిది: రాహుల్ గాంధీ

పేదల వ్యతిరేక ప్రభుత్వమిది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలకు దిగుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు సెంట్రల్ సర్కార్‌‌పై విరుచుకుపడ్డారు. కరోనా రక్కసి తీవ్రంగా భయపెడుతున్న ఈ సమయంలో కూడా లాభాలను ఆర్జిస్తున్న కేంద్రం పేదలకు వ్యతిరేకమని దుయ్యబట్టారు. శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపడం ద్వారా ఈ నెల 9వ తేదీకి రూ.429.90 కోట్ల రెవెన్యూ వచ్చిందని రైల్వే శాఖ చెప్పిన ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు.

సర్కార్ తీరును ఎండగడుతూ రాహుల్ ట్వీట్‌ చేశారు. ‘ఎన్నో రోగాలు వస్తున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా ఒకరు లాభాలను గడిస్తున్నారు. విపత్తులను ఆసరాగా చేసుకొని పేదల వ్యతిరేక ప్రభుత్వం సంపాదనను పెంచుకుంటోంది’ అని రాహుల్ విమర్శించారు. ఈ ట్వీట్‌కు జతగా రైల్వే రెవెన్యూ రిపోర్ట్‌ను జత చేశారు. పని ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడానికి కేంద్రం మే 1 నుంచి శ్రామిక్‌ రైళ్లను నడిపించింది. 4,496 స్పెషల్ రైళ్లను నడిపిన గవర్నమెంట్ 6.3 మిలియన్‌ ప్రజలను స్వరాష్ట్రాలకు తరలించింది.