
పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి సఫారీ పార్కులో ఉంచిన అక్బర్, సీత అనే సింహాల పేర్లు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు మౌఖిక ఆదేశాలు జారీచేసింది. సింహాలకు ఆ పేర్లు పెట్టి ఎందుకు వివాదాన్ని రాజేశారని ప్రశ్నించింది. ఆడ సింహానికి సీత అని పేరు పెట్టడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయని వీహెచ్‌పీ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఏ మతానికి చెందిన దేవతల పేర్లను జూలోని జంతువులకు పెట్టొద్దని కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
కాగా త్రిపుర జూ నుంచి తీసుకొచ్చిన ఆ సింహాలకు అక్కడే ఆ పేర్లు పెట్టారని రాష్ట్ర సర్కారు కోర్టుకు వివరణ ఇచ్చింది. దీనిపై అదనపు అడ్వకేట్ జనరల్ జోయ్‌జిత్ చౌదరి స్పందించారు. త్రిపురలో ఉన్నప్పుడు వాటి పేరు సూరజ్, తనయ అని కలకత్తాకు తీసుకొచ్చాక వాటి పేర్లు అక్బర్, సీత అని మార్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని త్రిపుర ప్రభుత్వమే రాతపూర్వకంగా తెలిపిందని అన్నారు.
త్రిపుర ప్రభుత్వ రిపోర్టును పరిశీలించిన కోర్టు పేర్లు మార్చి ముందున్న పేర్లనే ఉంచాలని ఆదేశించిందని ఆయన అన్నారు. మరోవైపు సింహాల పేర్ల మార్పుపై వీహెచ్పీ నాయకులు స్పందించారు. వీహెచ్పీ నేత సుదీప్తో మజుందార్ మాట్లాడుతూ.. ఏ జంతువుకు ఏ దేవత పేరు పెట్టకూడదని తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం కావాలనే ఈ పేర్లు పెట్టిందని.. అదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా కోర్టు కూడా దాన్ని నమ్మిందన్నారు.