సీఐడీ మహిళా డీఎస్పీ పీవీ లక్ష్మి ఆత్మహత్య

సీఐడీ మహిళా డీఎస్పీ పీవీ లక్ష్మి ఆత్మహత్య

స్నేహితురాలి ఇంటికి డిన్నర్ కు వెళ్లి.. ఫ్రెండ్ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య

బెంగళూరు: కర్నాటక సీఐడీ మహిళా డీఎస్పీ పీవీ లక్ష్మి (33) ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి స్నేహితురాలి ఇంటికి డిన్నర్ కు వెళ్లిన ఆమె.. డిన్నర్ ముగిసిన తర్వాత రాత్రి 10.30గంటల సమయంలో బెడ్ రూమ్ లోకి వెళ్లి సీలింగ్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2014లో కర్నాటక పబ్లిక్ సర్వీష్ కమిషన్ నిర్వహించిన సీఐడీ పరీక్షల్లో పీవీ లక్ష్మి ఉత్తీర్ణురాలైంది. పోలీసు శిక్షణ అనంతరం 2017లో కర్నాటక పోలీసు శాఖలో చేరింది. డీఎస్పీ హోదాలో పలుచోట్ల పని చేసిన ఆమె ప్రస్తుతం సీఐడీ విభాగంలో పనిచేస్తోంది. నిన్న రాత్రి స్నేహితురాలి ఇంట్లో డిన్నర్ ఉందని వెళ్లిన ఆమె.. రాత్రి 10.30 గంటల తర్వాత స్నేహితురాలి ఇంట్లోనే ఉరేసుకున్నట్లు చెబుతున్నారు.  పీవీ లక్ష్మి ఆత్మహత్యకు కారణాలు తెలియదని.. తామంతా షాక్ లో ఉన్నామని పోలీసులు అంటున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కు పంపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక కాల్ డేటాను పూర్తిగా విశ్లేషించాక వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరిపి వాస్తవాలు బయటకు తీసుకొస్తామని అంటున్నారు. చిన్న వయసులోనే డైరెక్టు పోలీసు ఆఫీసర్ గా ఎంపికైన ఆమె ఊహించని రీతిలో చనిపోవడం కర్నాటకలో కలకలం రేపుతోంది.