బట్టలు బాగోలేవని మెట్రో రైలు ఎక్కనీయని సిబ్బంది.. కూలీలు మెట్రో రైలు ఎక్కకూడదా..!

బట్టలు బాగోలేవని మెట్రో రైలు ఎక్కనీయని సిబ్బంది.. కూలీలు మెట్రో రైలు ఎక్కకూడదా..!

చిరిగిన చొక్కా అయినా వేసుకో.. కానీ ఒక మంచి పుస్తకం మాత్రం చదువు అన్నారు పెద్దలు.. అంతేనా మనిషి వేసుకున్న బట్టలను బట్టి అతన్ని అంచనా వేయటం అనేది చాలా తప్పు.. ఈ మాటలు ఎందుకు అంటారా.. బెంగళూరులో జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరు సిటీలో మెట్రో రైలు ఉంది.. దొడ్డకళ్లసంద్ర ప్రాంతంలో మెట్రో స్టేషన్ ఉంది. 2024, ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం.. ఓ వ్యక్తి మెట్రో స్టేషన్ లోకి వచ్చాడు. టికెట్ తీసుకున్నాడు.. అక్కడి నుంచి రైలు ఎక్కటానికి ముందుకు వెళుతుండగా.. మెట్రో సిబ్బంది ఆపారు.. నీ బట్టలు శుభ్రంగా లేవు.. క్లీన్ చేసుకుని రా.. నీ షర్ట్ బటన్స్ పెట్టుకో.. నీటుగా వస్తేనే మెట్రో రైలులోకి పంపిస్తాం అంటూ అడ్డుకున్నారు. 

ఈ విషయాన్ని అక్కడే ఉన్న ప్రయాణికులు గమనించి ప్రశ్నించారు. అతని దగ్గర టికెట్ ఉంది.. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మెట్రో సిబ్బందిని నిలదీశారు. దీంతో వారు చెప్పిన సమాధానం అందర్నీ షాక్ కు గురి చేసింది. 

అతని బట్టలు బాగోలేవు.. చొక్కా బటన్స్ కూడా పెట్టుకోలేదు.. అతను తాగి ఉన్నాడేమో.. అలాంటి వ్యక్తిని రైలులోకి అనుమతిస్తే మహిళలు, పిల్లలను ఇబ్బంది పెడితే ఎవరు బాధ్యులు అంటూ.. ప్రశ్నించిన ప్రయాణికులపైనే మెట్రో సిబ్బంది చిర్రుబుర్రులాడటం విశేషం. 

బాధితుడిని ప్రశ్నించగా.. విచారించగా అతను కూలీ పనులు చేసే యువకుడు అని.. కూలీ పని చేసుకుని ఇంటికి వెళుతూ మెట్రో రైలు కోసం వచ్చాడని స్పష్టం అయ్యింది. వేసుకునే బట్టలతో అతన్ని తప్పుగా ఎలా అనుమానిస్తారంటూ మెట్రో సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి.

మొత్తానికి బట్టలు బాగోలేవంటూ అడ్డుకున్న వ్యక్తిని.. చివరకు మిగతా ప్రయాణికుల ఒత్తిడితో.. విచారణ తర్వాత మెట్రో రైలులోకి అనుమతించారు.

ఇలాంటి ఘటన బెంగళూరు మెట్రోలో కొత్త కాదు.. గతంలో ఓ రైతును కూడా ఇలాగే అడ్డుకున్నారు. చిరిగిన బట్టలతో.. నెత్తిపై సంచితో వచ్చిన రైతును మెట్రో రైలు ఎక్కకుండా అడ్డుకున్నారు సిబ్బంది.. ఆ ఘటనలో సిబ్బందిని తొలగించారు అధికారులు. ఇప్పుడు ఇలా.. 

బెంగళూరు మెట్రో ఎక్కాలంటే సూటుబూటు వేసుకుని ఉండాలా అనే ప్రశ్నలను ఇప్పుడు బెంగళూరు జనం నుంచి వస్తున్నాయి.. దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి...