కోపంతో డెలివరీ బాయ్‌ని వెంటాడి కారుతో ఢీకొట్టిన కపుల్.. చిన్న తప్పుకే చంపేస్తారా..?

కోపంతో డెలివరీ బాయ్‌ని వెంటాడి కారుతో ఢీకొట్టిన కపుల్.. చిన్న తప్పుకే చంపేస్తారా..?

కొందరి ర్యాష్ డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు పోతుంటే.. మరికొందరు కావాలని చేసే పనులు రోడ్డుపై అమాయకుల ప్రాణాలు తీస్తుంటాయి. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఒక ఘటన సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే ఏంట్రా మరీ ఇంత దారుణంగా ఉన్నారు అనే ఫీలింగ్ కలగక మానదు. 

బెంగళూరులో జరిగిన ఘటన అందరినీ షాక్ కి గురిచేస్తోంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఒక డెలివరీ బాయ్ ని కారులో వచ్చిన ఒక జంట వెంటాడి ఢీ కొట్టడం అతని మరణానికి కారణం అయ్యింది. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పుట్టెనహల్లి పోలీస్టేషన్ పరిధిలో జరిగిన ఘటన సీసీ టీవీ విజువల్స్ బయటకు వచ్చాయి. ప్రమాద సమయంలో బైక్ డ్రైవింగ్ చేస్తున్న దర్శన్ మృతి చెందగా, వెనకాల ఉన్న అతని మిత్రుడు వరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. 

ప్రస్తుతం ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కావాలని వెంబడించి బైక్ ఢీకొట్టిన కపుల్ మనోజ్ కుమార్, ఆర్తీలను అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో సదరు టూవీలర్ రైడర్ దీనికి ముందు తమ కారు సైడ్ అద్దం విరగొట్టాడని దంపతులు చెప్పారు. దీంతో కోపం వచ్చి కారు వెనక్కి తిప్పి గిగ్ వర్కర్ స్కూటర్ వెంబడించి ఢీకొట్టినట్లు డీసీపీ వెల్లడించారు. 

అరెస్ట్ అయిన మనోజ్ మార్షల్ ఆర్ట్స్ టీచర్ అని తేలింది. సంఘటన తర్వాత తన భార్యతో కలిసి యాక్సిడెంట్ అయిన స్థలానికి ముసుగులు ధరించి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వారు అక్కడ ఆధారాలను నాశనం చేసే ప్రయత్నం కూడా చేసినట్లు వెల్లడైంది. తమ కారుకు సంబంధించిన విరిగిన భాగాలను సేకరించి దొరక్కుండా తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు తేలింది. ప్రస్తుతం వీరిపై పోలీసులు హత్యతో పాటు సాక్ష్యాలను నాశనం చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.