
బెంగళూరును అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. కుండపోతగా కురుస్తున్న వానకు పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వరదలకు ఓ బంగారం దుకాణంలో నీరు చేరి బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయి. చెత్తా చెదారంతో కొట్టుకువచ్చిన నీటిలో 80 శాతానికి పైగా నగలు నీటిపాలయ్యాయి. వాటి విలువ దాదాపు రెండుకోట్లు ఉంటుందని దుకాణ యజమాని బోరుమన్నాడు. అధికారులకు ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆభరణాలు కొట్టుకుపోయాయి
ఈ వరదల కారణంగా మల్లీశ్వర్ ప్రాంతంలోని ఓ బంగారం దుకాణం పెద్దమొత్తంలో నష్టపోయింది. ఆ ప్రాంతంలోని 9వ క్రాస్‌లో ఉన్న నిహాన్ జ్యువెల్లరీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో షాపులో ఉన్న రూ. కోట్ల విలువైన బంగారు నగలు వరదలో కొట్టుకుపోయినట్లు దుకాణం యజమాని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు ఫోన్‌చేసినా స్పందించలేదని మండిపడ్డారు. దుకాణంలోని 80 శాతం నగలు వరద నీటిలో కొట్టుకుపోయాయని...వాటి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.
బెంగుళూరులో రెండు రోజులుగా ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. బెంగళూరు విధానసౌధ, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, ఆనంద్ రావు, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, మల్లీశ్వర్ సహా పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపునీరు, మురుగునీరు చేరింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.