
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ కాలేజీ విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్లతో పాటు వారి ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా తరచూ బ్లాక్మెయిల్చేస్తుండడంతో పోలీసులు ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. నరేంద్ర, సందీప్ అనే లెక్చరర్లు విద్యార్థినికి ఫిజిక్స్, బయాలజీబోధించేవారు. వారి స్నేహితుడు అనూప్ సిటీలోని మరో ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాడు.
నరేంద్ర విద్యార్థినికి అకడమిక్ నోట్స్ ఇస్తానని చెప్పి ఆమెతో స్నేహం చేశాడు. నిరంతరం మెసేజ్‌లు పంపుతూ ఆమెతో సన్నిహితంగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆమెను మరాఠహళ్లిలోని అనూప్ గదికి రప్పించి.. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత బయాలజీ లెక్చరర్ సందీప్ కూడా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు.
ఆమె ప్రతిఘటించడంతో నరేంద్రతో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆ బెదిరింపులకు లొంగిన విద్యార్థినిపై సందీప్ కూడా అనూప్ గదిలో అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అనూప్.. తన గదిలోకి ప్రవేశించిన సీసీటీవీ ఫుటేజ్‌తో విద్యార్థినిని బెదిరించి, అతడు కూడా ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత కూడా నిందితులు ఆమెను తరచూ బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో ఆమె జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో వారు కర్నాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ను సంప్రదించి, ఆపై మారఠహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు.. నరేంద్ర, సందీప్ తో పాటు అనూప్నూ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.